చుక్కలమందుకోసం పట్టుబడుతున్న ఆనందయ్య..

Deekshitha Reddy
ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేదం మందుల్లో కంట్లో వేసే చుక్కలమందు పంపిణీకి అనుమతులివ్వలేమని హైకోర్టు చెప్పింది. అదే సమయంలో చుక్కలమందు విషయంలో నిపుణులు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని, దానికోసం కృష్ణపట్నం వచ్చే కరోనా రోగుల్ని కంట్రోల్ చేయడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దశలో ఆనందయ్య చుక్కలమందు పంపిణీ ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు. అయితే తన వైద్యానికి పేరుతెచ్చిన చుక్కలమందుకి అనుమతిచ్చే దాకా న్యాయపోరాటం చేస్తానంటున్నారు ఆనందయ్య. అన్ని మందులతో కలిపి చుక్కల మందు పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆనందయ్య ఇచ్చే ఐ డ్రాప్స్ విషయంలో హైకోర్టులో సుదీర్ఘ చర్చ జరిగింది. ఒకరకంగా ఆనందయ్య ఇచ్చే మందుల్లో ఐడ్రాప్సే కీలకం. ఆక్సిజన్ సాయంతో, అంబులెన్సుల్లో కృష్ణపట్నం వచ్చే కరోనా రోగులు ఆనందయ్య ఐడ్రాప్స్ వేయగానే లేచి కూర్చున్న ఉదాహరణలున్నాయి. అలాంటి వారి వీడియోల వల్లే ఆనందయ్యకు మంచి పాపులార్టీ వచ్చింది. పరిస్థితి క్లిష్టంగా ఉన్న రోగులకి సైతం ఆక్సిజన్ లెవల్స్ పెరగడం, వారు వెంటనే సాధారణ స్థితికి చేరడం నిజంగా విచిత్రంగా తోచేది. అయితే ఇప్పుడా మందు పంపిణీకి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. మిగతా 4రకాల మందుల పంపిణీకి అభ్యంతరం లేదని చెబుతున్న ప్రభుత్వం, ఐడ్రాప్స్ విషయంలో మాత్రం అనుమతి ఇవ్వలేమని కోర్టుకి తెలిపింది.
ఆనందయ్య ఐ డ్రాప్స్‌ పరిశుభ్ర వాతావరణంలో తయారు కావట్లేదని నిపుణుల కమిటీ తేల్చిందని, ఈ డ్రాప్స్‌ ను వేసుకునేవారి కళ్లు దెబ్బతినే వీలుందని, అందుకే ప్రస్తుతానికి ఐ డ్రాప్స్‌ పంపిణీకి అనుమతినివ్వలేమని ప్రభుత్వం కోర్టుకి తెలిపింది. ఐ డ్రాప్స్‌ పై తదుపరి పరీక్షలు అవసరమని, ఇందుకు నెలనుంచి 3 నెలలకు పైగా సమయం పట్టే వీలుందని చెప్పింది. ప్రభుత్వం అనుమతివ్వకపోయినా, స్వచ్ఛందంగా ఐ డ్రాప్స్ వేసుకునేవారికి అవకాశం ఇవ్వొచ్చు కదా అని కోర్టు సూచించింది. ఆ దిశగా కోర్టులు ఉత్తర్వులిస్తే తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో కోర్టు కూడా అనుమతి విషయంలో జోక్యం చేసుకోకుండా విచారణ వాయిదా వేసింది.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఆనందయ్య ఐ డ్రాప్స్ కి ఇప్పుడప్పుడే అనుమతి వచ్చేలా లేదు. ఒకవేళ వచ్చినా.. ఆ మందుకోసం కొవిడ్ రోగులెవరూ కృష్ణపట్నం ప్రాంతానికి రావడం కూడా శ్రేయస్కరం కాదు. కరోనా రోగులు తమ ప్రాంతానికి రావడం సరికాదని గతంలో స్థానికులు ఆందోళన చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఆనందయ్య మాత్రం అన్ని మందులతోపాటు చుక్కలమందుకి కూడా అనుమతివ్వాలని కోరుతున్నారు. ఐ డ్రాప్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా ప్రాణాపాయంలో ఉన్నవారికి వాటి అవసరం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: