భేష్.. రూ.10కే కరోనా చికిత్స..!

Suma Kallamadi
ప్రైవేట్, కార్పొరేట్ వైద్యులు.. కరోనా బాధితుల అవసరాన్ని అవకాశంగా మార్చుకుని ఒక్కొక్కల నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. కరోనా చికిత్సలో నిరుపయోగమైన ఇంజక్షన్లను సైతం వేల రూపాయలకు విక్రయిస్తున్న కేటుగాళ్లు కూడా కోకొల్లలు. ఐతే పేరాశతో కరోనా బాధితులను రాబందుల్లా పీక్కు తింటున్న వైద్య వ్యవస్థలో కూడా కొందరు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు.
తమ ఆస్పత్రికి వచ్చిన రోగుల నుంచి లక్షల రూపాయలు కాజేయకుండా.. వారిని ప్రాణాలతో తిరిగి పంపించాలన్న ఏకైక లక్ష్యంతోనే నిజాయితీగా వైద్యం చేసే వైద్యులు అక్కడక్కడా కనిపిస్తూ మనుషుల్లో దేవుళ్లల్లా కొలవబడుతున్నారు. హైదరాబాద్ కి చెందిన డా. విక్టర్ ఇమ్మాన్యుయేల్ కూడా ప్రస్తుతం రోగులకు దేవుడిలా మారారు. మెరుగైన వైద్యం పొందలేని పేదవారికి తక్కువ ధరలకే చికిత్స అందిస్తున్నారు. 2018 నుంచి ఆయన పేదవారికి చాలా తక్కువ ధరలకే వైద్యం చేస్తున్నారు.
హైదరాబాదులోని బోడుప్పల్ లో ఆయన ఒక మెడికల్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. తెల్లరేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉన్న రోగులకు ఆయన కేవలం 10 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సైనికులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.

తాజాగా ఆయన ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "అవసరంలో ఉన్న ప్రజలకు సరసమైన ధరలకే వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ క్లినిక్ స్టార్ట్ చేశాం. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను గుర్తించి వైద్యం అందిస్తున్నాం. అంతేకాకుండా ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కూడా తక్కువ ధరలకే చికిత్స అందిస్తున్నాం. వీరిని మినహాయించి రైతులకు, యాసిడ్ బాధితులకు, అనాధలకు, వికలాంగులకు, జవాన్లకు మరియు వారి కుటుంబానికి కూడా చాలా తక్కువ ధరలకే వైద్యం చేస్తున్నాం. ల్యాబ్ టెస్ట్ లతోపాటు మెడిసన్ పై కూడా ధర తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. షుగర్ వ్యాధి ఉన్నవారికి, గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి, అలాగే మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారందరికీ చికిత్స అందిస్తున్నాం" అని ఆయన తెలిపారు.
కరోనా చికిత్సకు ఇతర ఆస్పత్రులు అత్యధిక ధరలు వసూలు చేస్తుండటం గమనించిన డా. విక్టర్ ఇమ్మాన్యుయేల్.. కరోనా రోగులకు కూడా కేవలం పది రూపాయలకే చికిత్స అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అవసరమైన మందులు అందించడంతో పాటు హోమ్ ఐసోలేషన్ విషయంలో పాటించాల్సిన ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు ఒక 100 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని.. మొదట్లో కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రోజుకి 140 మంది కరోనా రోగులకు చికిత్స అందించామని ఆయన అన్నారు. గడిచిన ఏడాది కాలంలో 20 వేల నుంచి 25 వేల వరకు కరోనా రోగులకు వైద్యం చేశామని ఆయన అన్నారు.
"ఐసీయూలో చికిత్స పొందుతున్న తన భర్తకి మెడిసిన్స్ కొనాలని ఓ ఆస్పత్రి ఎదుట నిల్చొని ఒక మహిళ వచ్చేపోయే వారిని డబ్బులు అడగటం చూసి.. నా మనసు చలించిపోయింది. ఆ ఒక్క ఘటన నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడే నేను పేదవారికి తక్కువ ధరలకు వైద్యం చేయాలని నిశ్చయించుకున్నాను. రోగుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ₹10 ఛార్జ్ చేస్తున్నాను" అని ఆయన అన్నారు. వైద్యం అందించడంతోపాటు స్నేహహస్తం అనే సేవ సంస్థ ద్వారా పేదలకు ఆహారం కూడా అందిస్తున్నామని ఆయన తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: