ఇలాంటి ఖ‌ర్మ ప‌ట్టింది నాకు.. ఏం చేయ‌ను?: మంత్రి పెద్దిరెడ్డి

Garikapati Rajesh

ఏపీ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి నిర్వేదానికి లోన‌య్యారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పుంగ‌నూరులో తాను న‌మ్మిన నాయ‌కులే ప‌నులు చేయ‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొవిడ్ లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితిల్లో ఇంటింటికి తిరిగి ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకొని మ‌హ‌మ్మారిని నియంత్రిస్తుంటే ప్ర‌భుత్వ‌ప‌రంగా, పార్టీప‌రంగా మంచిపేరు వ‌స్తుంద‌న్నారు.  ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని తాను ప‌రిత‌పిస్తుంటే దుర‌దృష్ట‌వ‌శాత్తూ త‌న ఫొటో పెట్టుకొని, త‌న పేరుమీద గెలిచిన‌వారంతా ఇంట్లో నిద్ర‌పోతున్నార‌ని, వారికి ప‌నిచేయాల‌నే ధ్యాసే క‌న‌ప‌డ‌టంలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
ప్ర‌జాప్ర‌తినిధులెవ‌రికీ ప‌నిచేయాల‌న్న ధ్యాసే లేదు?
చిత్తూరు జిల్లా పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జాప్ర‌తినిధులెవ‌రికీ ప‌నిచేయాల‌న్న ధ్యాసే లేద‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం మంత్రి సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం విశేషం. ఎంపీటీసీగా, జ‌డ్పీటీసీగా, కార్పొరేట‌ర్లుగా, స‌ర్పంచ్‌గా గెలిచిన‌వారంతా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. వారంతా ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగి గెలిచివుంటే ఆ విలువ తెలిసివుండేద‌ని.. కానీ వారంతా ఇంట్లో కూర్చుంటే తాను నామినేష‌న్లు వేయ‌మ‌ని చెప్పాన‌ని, ఆ నామినేష‌న్ల‌ను ఇంటికి పంపించాన‌న్నారు. ఎవ్వ‌రూ రూపాయి ఖ‌ర్చు చేయ‌కుండా అంద‌రికీ ప‌దవులు ద‌క్కేలా చేశాన‌న్నారు. అయినా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వీరెవ‌రికీ ధ్యాస లేద‌ని, ఇలావుంటే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రావ‌డం ఖాయ‌మ‌ని, ఆ ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌పై కూడా ప‌డుతుంద‌న్నారు. ఒక్క పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలోనే త‌న‌కు ముగ్గురు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శులున్నార‌ని, వారు కూడా ఇక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధుల్లానే ప‌నిచేస్తున్నార‌ని.. త‌న‌కు ఇటువంటి ప‌రిస్థితి దాపురిస్తుంద‌ని అనుకోలేద‌న్నారు.
కొవిడ్ ఆసుప‌త్రిగా పుంగ‌నూరు పీహెచ్‌సీ
చిత్తూరు జిల్లా పుంగ‌నూరు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని కొవిడ్ ఆసుప‌త్రిగా మార్చారు. జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రినారాయ‌ణ్‌తో క‌లిసి మంత్రి అక్క‌డ అందుతున్న సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కొవిడ్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వ‌ప‌రంగా, వ్య‌క్తిగ‌తంగా త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తున్న‌ప్ప‌టికీ అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని ప్ర‌జ‌ల‌కు స‌కాలంలో సేవ‌లందించ‌డానికి ప్ర‌జాప్ర‌తినిధులు కృషిచేయ‌క‌పోతే ఎలా? ఇక‌నైనా మీరు మారాలి.. లేనిప‌క్షంలో నా బాధ నేను ప‌డ‌తా.. మీ బాధ మీరు ప‌డండి అంటూ మంత్రి హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: