ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

Spyder
క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో మాన‌వాళిని వ‌దిలేలా లేదు. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రూపాన్ని మార్చుకొని మ‌రింత విరుచుకుప‌డుతోందీ మ‌య‌దారి రోగం. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అయితే క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా ఈ మాయ‌దారి రోగం ప్ర‌జ‌ల‌ను వ‌దిలేలా క‌నిపించ‌ట్లేదు. తాజాగా బ్లాక్ ఫంగ‌స్‌/మ్యుక‌ర్‌మైకోసిస్ పేరుతో కొత్త వ్యాధి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిని ఇప్పుడు బెంబేలెత్తిస్తున్నది బ్లాక్ ఫంగస్(మ్యూకర్‌మైకోసిస్). చికిత్స సమయంలో బాధితులకు అత్యంత అవసరం ఆక్సిజన్.

 ఈ ఆక్సిజన్‌ను హ్యూమిడిఫయ్యర్ల(తేమ అందించే పరికరం) ద్వారా అంద‌జేస్తారు. ఆక్సిజన్ హ్యూమిడిఫయర్లలో స్టెరైల్ వాటర్ నింపాలి. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఇళ్లలో చికిత్స తీసుకుంటున్న అనేకమంది ఈ హ్యుమిడిఫయర్లలో సాధారణ నీటిని వాడుతుండ‌టం వ‌ల్లే బ్లాక్ ఫంగ‌స్ పెరుగుతుంద‌న్న వాద‌న‌ను కొంత‌మంది వైద్య నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా వాడడం వల్ల ఆ నీటిలో ఉన్న సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి అనేక హానికారక జీవులు నేరుగా శ్వాసకోశంలోకి చేరే ప్రమాదం ఉంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.  తద్వారా బ్లాక్ ఫంగస్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్ అతుల్ అభ్యంకర్ దీనిపై స్పందించారు.


బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లేనని, వాటిలో స్టెరైల్ నీటినే ఉపయోగించాలని చెప్పారు. అయితే ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న బాధిుతులు ఈ హ్యూమిడిఫయర్లలో సాధారణ నల్లా నీటినే వినియోగిస్తున్నారని, దీనివల్ల అందులో ఉండే రకరకాల సూక్ష్మజీవులు శరీరంలోకి చేరి ఫంగస్ ఏర్పడుతోందని  ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. హ్యుమిడిఫయర్లలో స్టెరైల్ నీటినే వినియోగించాలని, 24 గంటల్లో రెండుసార్లు నీటని మార్చాలని సూచించారు. ఎప్పటికప్పుడు హ్యుమిడిఫయర్‌ను శుభ్రం చేస్తుండాలన్నారు. అప్పుడే సూక్ష్మజీవులు, బాక్టీరియాలు, ఫంగస్‌ల నుంచి రక్షణ పొందగలుగుతామని అతుల్ అభ్యంకర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: