తారక్‌ని వదలని బుచ్చయ్య...అసలు టార్గెట్ ఏంటో?

M N Amaleswara rao

గోరంట్ల బుచ్చయ్య చౌదరీ....తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. దశాబ్దాల పాటు ఆ పార్టీలో రాజకీయం చేస్తున్న నాయకుడు. అయితే ఇలా సీనియర్‌గా ఉన్న బుచ్చయ్య, ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ పేరుని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అయితే బుచ్చయ్య ఇలా జూనియర్ పేరు ఎక్కువ తలుచుకోవడానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ కనుమరుగైపోయింది.


ఇక ఏపీలో కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇటు చంద్రబాబుకు వయసు మీద పడింది. నారా లోకేష్ పార్టీని సమర్ధవంతంగా నడిపించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలని డిమాండ్ బాగా పెరిగిపోతుంది. అభిమానులు, కార్యకర్తలు జూనియర్ పేరుని ఎక్కువ పలుకుతున్నారు. అటు ప్రత్యర్ధి పార్టీ నేతలు కూడా తారక్ రావాల్సిందే అనే విధంగా మాట్లాడుతున్నారు.


బుచ్చయ్య చౌదరీ సైతం టీవీ డిబేట్లలో, సోషల్ మీడియాలో తారక్ పేరుని ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎన్టీఆర్‌కు ఉందని మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఆ విషయం గురించి చాలాసార్లు మాట్లాడారు. ఇక తాజాగా ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తారక్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేశారు. అటు చంద్రబాబు, లోకేష్‌లు సైతం తారక్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.


అయితే ఇక్కడ బుచ్చయ్య ఏదొకరకంగా తారక్ పేరు తీసుకోస్తూనే ఉన్నారు. అంటే ఎన్టీఆర్ అయితేనే పార్టీని సమర్ధవంతంగా టీడీపీని నడిపించగలరని బుచ్చయ్య గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. పైగా బుచ్చయ్యకు ఎన్టీఆర్ కుటుంబం అంటే అభిమానం ఎక్కువ. అసలు చంద్రబాబు, సీనియర్ ఎన్టీఆర్‌ని సీఎం పీఠం నుంచి గద్దె దింపిన సమయంలో, బుచ్చయ్య, ఎన్టీఆర్ వెంటే నడిచారు.


ఆయన చనిపోయాక అన్న టీడీపీలో పనిచేశారు. కానీ తర్వాత చంద్రబాబు పిలుపుతో మళ్ళీ టీడీపీలోకి వచ్చేసి కీలకంగా పనిచేస్తున్నారు. కానీ బాబు పెద్దగా బుచ్చయ్యకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. అందుకే బుచ్చయ్య సైతం నెక్స్ట్ పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేపడితే పరిస్తితి వేరుగా ఉంటుందని నమ్ముతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: