భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

SRISHIVA
భారతదేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన వైరస్.. మార్చి నుంచి మళ్లీ పంజా విసురుతోంది. మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని 11 రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోందని వైద్య వర్గాలు హెచ్చరించాయి. కరోనా కట్టడి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. తాజాగా మనదేశంలో కరోనాకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. ఏప్రిల్  రెండో వారం తర్వాత దేశంలో కరోనా వైరస్ విజృంభణ గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మే చివరి వరకు అలానే కొనసాగి ఆ తర్వాత క్రమంగా తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది సెప్టెంబరులో వైరస్ గరిష్ఠ స్థాయికి చేరుకుని ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి తగ్గిందని, ప్రస్తుతం రెండో దశలోనూ వైరస్ ఉద్ధృతి అలానే ఉండే అవకాశం ఉందని  ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరును చూస్తే ఏప్రిల్ 15-20 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్రా అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉందని, మున్ముందు ఆ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మహారాష్ట్ర, పంజాబ్‌లలో కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని తెలిపారు. హర్యానాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మీనన్ మాత్రం ఏప్రిల్, మే నాటికి వైరస్ విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. వైరస్ వ్యాప్తి రేటు, అది సోకే అవకాశం ఉన్న జనాభా, పాజిటివ్ కేసుల సంఖ్యను ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు ఈ అంచనాకొచ్చారు.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఇలాగే కొనసాగితే.. లాక్‌డౌన్‌ విధించే అవకాశం లేకపోలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే స్పష్టం చేశారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వానికి మాత్రం ఏం చేయాలో పాలుపోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలా? లేక ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. మహారాష్ట్రలో కరోనా రోజువారీ కొత్త కేసులు భారీ స్థాయిలో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉద్ధవ్‌ ఆ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: