బాబుకే వార్నింగ్ ఇచ్చిన ఆ సీనియర్‌.. జూనియర్‌కు హింట్ ఇస్తున్నారా?

M N Amaleswara rao


తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన బుచ్చయ్య టీడీపీలో కీలక నాయకుడుగా ఎదిగారు. అయితే ఎన్టీఆర్‌ని గద్దె దింపే సమయంలో చంద్రబాబుతో వెళ్లకుండా ఎన్టీఆర్‌తోనే నడిచారు. అలాగే ఎన్టీఆర్ చనిపోయాక కూడా అన్న తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు.


కానీ చంద్రబాబు పార్టీలోకి తిరిగి రమ్మనడంతో బుచ్చయ్య మళ్ళీ టీడీపీలోకి వచ్చేశారు. ఇక అప్పటి నుంచి టీడీపీలో ముఖ్యనాయకుడుగా మారిన బుచ్చయ్య...పార్టీలో ఏమన్నా తప్పులు జరిగితే ఏ మాత్రం మొహమాటం లేకుండా ఓపెన్‌గానే చెప్పేస్తారు. 2014లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకోవడాన్ని కూడా తప్పుబట్టారు. అయితే ఇలా ప్రతి విషయంలో ఓపెన్‌గా ఉండే ఈ సీనియర్ నాయకుడు, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.


ఎన్టీఆర్  స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఇప్పుడు వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందని మాట్లాడిన బుచ్చయ్య...గ్రౌండ్  రియాల్టీస్ ప్రకారం టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతుందని, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు టీడీపీ బలోపేతం కోసం పనిచేయాలని బుచ్చయ్య కోరారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్న ప్రచారం ఎక్కువ అవుతుంది. ఇటు కొందరు టీడీపీ నేతలు సైతం ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారు.


ఇలాంటి సమయంలోనే బుచ్చయ్య, టీడీపీ కోసం ఎన్టీఆర్ పనిచేయాలని కోరడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కష్టకాలంలో ఉంది. అలాగే టీడీపీకి ఓ క్రౌడ్ పుల్లర్ కావాలి. ప్రజలని ఆకర్షించే సత్తా ఎన్టీఆర్‌కు బాగానే ఉంది. దీనికి తోడు బుచ్చయ్య, పెద్ద ఎన్టీఆర్‌కు వీరాభిమాని, పైగా చంద్రబాబుతోనే కొన్ని సందర్భాల్లో విభేదించారు. ఇక ఇవన్నీ చూసుకుంటే రాబోయే రోజుల్లో టీడీపీని ఎన్టీఆర్ నడిపించాలని బుచ్చయ్య బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి భవిష్యత్‌లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారో లేదో. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: