సంచలనం: బాబుకు ఆత్మహత్య రైతు లేఖ..!

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతుల ఆత్మహత్యలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. మిగిలిన పంట విషయం ఎలా ఉన్నా.. పొగాకు లాభసాటి పంట. ఈ పంటలో సాధారణంగా నష్టపోయి ఆత్మహత్యల వరకూ వెళ్లడం ఉండదు. కానీ రెండేళ్లుగా పొగాకు బోర్డు నిర్లక్ష్యం కారణంగా పొగాకు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. 

ఇటీవల వరుసగా పొగాకు రైతుల ఆత్మహత్యలు జరిగాయి. వారిలో పశ్చిమ గోదావరి జిల్లా యర్నగూడెంకు చెందిన సింహాద్రి వెంకటేశ్వర రావు ఒకరు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునే కొన్ని రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాశారు.  లేఖ రాసిన కొన్ని రోజులకు ఆయన ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సింహాద్రి వెంకటేశ్వరరావు లేఖ కలకలం సృష్టిస్తోంది. 

పొగాకు రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆ లేఖలో వెంకటేశ్వరరావు తప్పుబట్టారు. ఈ మధ్య సీఎం ప్రాణ రక్షణ కోసం ఐదున్నర కోట్లు పెట్టి... ఓ ప్రత్యేక బస్సును తయారు చేయించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని లేఖలో ప్రస్తావించిన వెంకటేశ్వరరావు.. రైతుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అని ప్రభుత్వం భావించాలని కోరాడు. 

చంద్రబాబుకు బస్సు ఏర్పాటు చేయడం కంటే.. అదే సొమ్ముతో పొగాకు రైతుల ప్రాణాలు కాపాడం ముఖ్యం కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఒక్కో బ్యారనుకు రూ.9లక్షల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం ఇస్తే రైతులు తమ పొగాకు బ్యారను లైసెన్సులను స్వచ్ఛందంగా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు. పొగాకు రైతులకు న్యాయం చేయడం కోసం తాను ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నానంటూ లేఖలో పేర్కొన్నారు. ఆయన ఈ లేఖ రాసిన వారం రోజులకే పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: