నాగార్జున‌సాగ‌ర్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆయ‌నే

Garikapati Rajesh
దుబ్బాక ఉప ఎన్నికలో పరాజయంపాలైన తెలంగాణ రాష్ట్ర‌స‌మితి నాగార్జున‌సాగ‌ర్ స్థానంలో పోటీచేసే అభ్య‌ర్థి ఎంపిక‌పై ఆచితూచి అడుగులేస్తోంది. దుబ్బాకలో గెలిచి దూకుడుమీదున్న బీజేపీ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకోవడంతో గులాబీ దళం అంతకుమించి కసరత్తులు చేస్తోంది. ముందుకు వ‌స్తోన్న ఔత్సాహిక అభ్య‌ర్థుల చ‌రిత్ర‌ను కాచి వ‌డ‌పోస్తోంది.
ప‌దవిలో ఉన్న ప్రజాప్రతినిధి మరణిస్తే ఆయన కుటుంబ స‌భ్యుల‌ను బ‌రిలోకి దింపి సానుభూతి ఓట్ల‌తో గ‌ట్టెక్క‌డ‌మ‌నేది పాత సాంప్ర‌దాయం. దుబ్బాకలో ఈ వ్యూహం బెడిసికొట్ట‌డంతో టీఆర్ ఎస్ కొత్త‌ వ్యూహాలకు పదునుపెడుతోంది. దీంతో నర్సింహయ్య కుమారుడు  భగత్ అభ్యర్థిత్వాన్ని ప‌క్క‌న పెట్టేసిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉండడంతో ధీటైన అభ్యర్థిని బరిలోకి దించే దిశగా టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ రేసులో ముందున్న సుధాకర్ యాదవ్, గురవయ్య యాదవ్, రంజిత్ యాదవ్‌కు అధినేత ఫోన్ చేసి మాట్లాడినట్లు చెబుతున్నారు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న జానారెడ్డికి 1994 ఎన్నికల్లో చెక్ పెట్టిన రామ్మూర్తి యాదవ్ కుటుంబానికే టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్న‌ట్లు తెలుస్తోంది. రామ్మూర్తి యాదవ్ అల్లుడు గురవయ్య యాదవ్ ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్ధి అవుతార‌నేది కేసీఆర్ భావ‌న‌. రాజ్యసభ్య ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ బంధువు కావడం, ఏపీలోని కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావుతో కూడా బంధుత్వం గురవయ్యకి కలిసొచ్చే అంశ‌మ‌వుతోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన రోజే అభ్యర్థి ప్రకటన ఉంటుందని.. అయితే అధినేత ఎవరి పేరు ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.
నియోజకవర్గాల పునర్విభజనతో చలకుర్తి నియోజకవర్గం మార్పులు చేర్పులతో నాగార్జున సాగర్ నియోజకవర్గంగా మారింది. పునర్విభజన అనంతరం జరిగిన 2009, 2014 ఎన్నికల్లో జానా రెడ్డి విజయం సాధించారు. అనూహ్యంగా 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న జానారెడ్డిని ఢీకొట్ట‌డం టీఆర్ ఎస్‌, బీజేపీకి ఒక‌ర‌కంగా స‌వాలే!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: