ఎలక్ట్రిక్ వాహనాలు తప్ప వేరే గత్యంతరం లేదా..?

NAGARJUNA NAKKA
పెట్రో, డీజిల్‌ ధరలు వాత పెడుతున్నాయ్‌..! బండి బయటికి తీసే పరిస్థితి లేదు. దీంతో జనం ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు చూస్తున్నారు. భవిష్యత్‌ మొత్తం ఎలక్ట్రిక్‌దేనంటున్నారు. పైగా కాలుష్య నివారణకు, పెరుగుతున్న పెట్రో ధరల నియంత్రణకు దీనినే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుండటంతో డిమాండ్‌ మరింతగా పెరిగింది.
దేశంలో కాలుష్యం పెరుగుతోంది. ఢిల్లీలో గట్టిగా గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. దీంతో కాలుష్య నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ క్లీన్‌ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో కూడా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 2030 కల్లా దశలవారీగా వాహనాలన్నింటినీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్చాలని నిర్ణయించింది.  దానిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై 12 శాతంగా ఉన్న జీఎస్‌టీని ఐదు శాతానికి తగ్గించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల ఆర్టీసీలు... ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేశాయి.
నిజానికి పెట్రోల్‌ ధరలు పెరగడం, కాలుష్యం ప్రధాన కారణాలైనప్పటికీ.. ఇప్పుడున్న వాహనాలతో పోల్చుకుంటే.. విద్యుత్‌ వాహనాలు చాలా బెటర్‌ అంటున్నారు. మెయింటైనెన్స్‌తో పాటు మైలేజీ పరంగా ఎలక్ట్రిక్‌ వెహికిల్సే మంచిదని చెబుతున్నారు. ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు రోడ్ల మీదికి వస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇప్పటికే చాలా చోట్ల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.  రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆటోమొబైల్ వ్యాపారులు చెబుతున్నారు. మైలేజీ, మెయింటైనెన్స్‌లోనే కాదు.. బ్రాండెడ్‌ బైక్‌లను తీసిపోని విధంగా కొత్త లుక్‌తో మతి పోగొడుతున్నాయ్‌ ఈ వాహనాలు.  స్టయిల్‌లోనూ ఆకట్టుకుంటున్నాయి. పైగా తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై ట్యాక్సులు రద్దు చేయడంతో డిమాండ్‌ పెరిగింది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు మరింత అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: