మీ క్రెడిట్ కార్డుపై ఉన్న ఛార్జీలను తెలుసుకోండి ఇలా..!?

N.ANJI
నేటి సమాజంలో చాల మంది క్రెడిట్ కార్డును వాడుతున్నారు. అయితే మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ జనరేట్ అయ్యే తేదీ మీకు తెలుసా? చాలామందికి ఈ విషయం తెలియదు. ప్రతీ నెల ఒకే రోజున మీ స్టేట్‌మెంట్ జనరేట్ అవుతుంది. స్టేట్‌మెంట్ జనరేట్ అయిన 15 నుంచి 20 రోజుల్లో బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ బిల్లును ఏ తేదీలోగా చెల్లించాలో దాన్నే పేమెంట్ డ్యూ డేట్ అంటారు. తప్పనిసరిగా చివరి తేదీలోగా బిల్లు పేమెంట్ చేయాలి. లేదా మినిమమ్ పేమెంట్ అయినా చెల్లించాలి. మినిమమ్ పేమెంట్ బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి.
మీ మొత్తం బిల్లులో కనీసం 5 శాతం మినిమమ్ పేమెంట్ ఉండొచ్చు. మినిమమ్ పేమెంట్ చెల్లించినా మీ ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బిల్ పేమెంట్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ ద్వారా అయితే చివరి తేదీ రోజున చెల్లించినా పర్లేదు. కానీ చెక్ పేమెంట్స్ చేస్తే మాత్రం కనీసం రెండు మూడు రోజుల ముందే చెల్లించాలి. క్లియరెన్స్ కోసం సమయం పడుతుంది. ఆలస్యం చేస్తే లేట్ పేమెంట్ ఛార్జీలు చెల్లించక తప్పదు.
కొన్ని బ్యాంకులు బిల్ పేమెంట్ కోసం రెండు మూడు రోజులు గ్రేస్ పీరియడ్ ఇస్తాయి. మీ కార్డుకు గ్రేస్ పీరియడ్ వర్తిస్తుందో లేదో చూడాలి. గ్రేస్ పీరియడ్ ఉంటే అప్పట్లోగా బిల్ చెల్లించాలి. గ్రేస్ పీరియడ్ లోగా పేమెంట్ చేయకపోతే పెనాల్టీ తప్పదు. అయితే గ్రేస్ పీరియడ్‌లో బిల్లు చెల్లిస్తే వడ్డీ వసూలు చేస్తుంది బ్యాంకు. ఈ వడ్డీ నెక్స్ట్‌ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తుంది. మీ టోటల్ డ్యూ అమౌంట్‌లో గత నెలలో మీరు చేసిన పేమెంట్స్, లేట్ పేమెంట్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, ట్రాన్సాక్షన్ ఛార్జీలు, క్యాష్ అడ్వాన్స్ ఛార్జీలు లాంటివి ఉంటాయి. యాన్యువల్ ఫీజు కూడా ఇందులోనే ఉంటుంది.
అందుకే బిల్లు మొత్తం చెల్లించేముందు మీకు సంబంధంలేని ఛార్జీలు ఉన్నాయేమో ఓసారి చూసుకోండి. మీరు మీ క్రెడిట్ కార్డును ఎక్కడ వాడారన్న వివరాలు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఉంటాయి. మీకు సంబంధం లేకుండా ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టైతే వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. ఇక మీ క్రెడిట్ లిమిట్ ఎంత ఉందో ఓసారి చూసుకోవాలి. రివార్డ్ పాయింట్స్ వివరాలు కూడా స్టేట్‌మెంట్‌లో ఉంటాయి. క్రెడిట్ కార్డ్ నియమ నిబంధనల్లో ఏవైనా మార్పులు ఉంటే స్టేట్‌మెంట్‌లో వివరిస్తాయి బ్యాంకులు. వాటిని చదవడం మర్చిపోవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: