క‌రోనా భ‌విష్య‌త్‌లో జలుబేన‌ట‌...నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Spyder
భవిష్యత్తులో కరోనా వైరస్ సాధారణ జలుబులా ప్రజల్లో పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. క‌రోనా వైర‌స్ బ‌లం త‌గ్గిపోతుంద‌ని ఊహిస్తున్నారు. కరోనా వైరస్ ఇప్పుడున్న స్టేజ్‌ నుంచి సాధారణ జలుబులా వచ్చిపోతుందని, ఆ స్థితికి ఈ ఇన్ఫెక్షన్‌ చేరిన తర్వాత.. సాధ్యమైనంత ఎక్కువ మంది బాల్యంలోనే కరోనా బారిన పడతారని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 3 నుంచి ఐదేళ్ల లోపు పిల్లలు తేలికపాటి కరోనా ఇన్ఫెక్షన్ ‌ను సాధారణ జలుబు రూపంలో ఎదుర్కోవాల్సి రావొచ్చని వారు అంచనా వేశారు. ఇక పెద్ద వారిని బాల్యంలో సోకిన ఇన్ఫెక్షన్‌ తో కలిగిన రోగ నిరోధకత రక్షణ కవచంలా కాపాడుతుందని తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునే వారికి తాత్కాలిక రక్షణే లభించినప్పటికీ, వ్యాక్సిన్ల ప్రభావంతో మరోసారి సోకే ఇన్ఫెక్షన్‌ తీవ్రత చాలా మేరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమంలో తొలి అంకం వేగంగా సాగుతోంది. దేశం నలుమూలలకూ టీకాల సరఫరా జోరందుకుంది. తొలిరోజు పెద్ద నగరాలకు టీకాలు తరలించగా.. రెండోరోజైన బుధవారం చిన్న నగరాలకు, పట్టణాలకు వ్యాక్సిన్లు చేరాయి. ఇప్పటిదాకా 56 లక్షల కొవిషీల్డ్‌ టీకాలు 13 నగరాలకు తరలగా.. కొవాగ్జిన్‌ టీకాలు 11 నగరాలకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్‌ అందుకున్న 1.1 కోట్ల డోసుల ఆర్డర్‌లో 95 శాతం మేర సరఫరా అయినట్టు సమాచారం. మిగిలిన లక్ష డోసుల టీకాను త్వరలోనే పంపనున్నారు. ఇక.. ప్రభుత్వం నుంచి 55 లక్షల డోసులకు ఆర్డర్‌ అందుకున్నామని.. తొలి బ్యాచ్‌ టీకాలను సరఫరా చేశామని భారత్‌ బయోటెక్‌ సంస్థ బుధవారం ప్రకటించింది.

తమ వ్యాక్సిన్లను గన్నవరం, గువాహటి, పట్నా, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, పుణె, భువనేశ్వర్‌, జైపూర్‌, చెన్నై, లఖ్‌నవు నగరాలకు పంపామని వెల్లడించింది. కేంద్రం నుంచి తొలి దశ టీకా కార్యక్రమానికి అవసరమైన వ్యాక్సిన్‌ డోసులు అందుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు శనివారం నుంచి టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లను ముమ్మరం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: