విగ్రహాల ధ్వంసంపై పవర్ స్టార్ ఆగ్రహం.. సీఎంపై మండిపాటు!

P.Phanindra
అమరావతి: భగవంతుని విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ‘‘ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఆపాటి చర్యలు కూడా తీసుకోలేదా? ఆలయ ఆస్తుల ధ్వంసానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని డిమాండ్ చేశారు. ‘మూర్తీభవించిన ధర్మం శ్రీరామచంద్రుడు’ అని రామాయణంలో ఓ రాక్షసుడు చెప్పాడని, త్రేతాయుగంలో ఒక రాక్షసుడు శ్రీరాముని గుణ గణాలను ఉన్నతంగా చెబితే... రాక్షస వారసులెవరో ఇప్పుడు ఇలా ధర్మ విచ్ఛిన్నానికి ఒడిగట్టారని పవన్ కల్యాణ్ మండి పడ్డారు.
‘రాష్ట్రంలో హిందూ విశ్వాసాలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా మర్లబండలో ఆంజయనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారామచంద్రుల విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. గడిచిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు, విగ్రహాలు అపవిత్రం అవుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. దీని వల్లే మతోన్మాదులు ఇలాంటి ఘాతుకాలకు తెగ బడుతున్నారు. పొరుగున ఉన్న శత్రుదేశంలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే అక్కడి ప్రభుత్వం 45 మంది నిందితులను అదుపులోకి తీసుకుంది. ఆ ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత కూడా తీసుకుంది. శత్రు దేశమే ఇలాంటి చర్యలు తీసుకుంటే.. జగన్ రెడ్డి ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదా?’ అని నిలదీశారు.
శక్తిపీఠం ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటన నుంచి తాజాగా రామతీర్థం, రాజమహేంద్రవరం వరకూ హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను పవన్ గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా మర్లబండలో విగ్రహాలను పగలగొడుతున్నా, రథాలను తగలబెడుతున్నా ప్రభుత్వ స్పందన ఉదాసీనంగా ఉందని మండి పడ్డారు. ప్రభుత్వం ఇలా నిర్లిప్తంగా ఉండటం వల్ల మరిన్ని దేవాలయాల్లో ఇలాంటి విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: