రాబోయే యుద్ధాలకు స్వదేశీ ఆయుధాలేనా!

yekalavya
సరిహద్దుల వద్ద చైనా రెచ్చగొడుతోంది. మరో పక్క పాక్ గుంటనక్కలు కాపు కాచి దాడి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్‌ యుద్ధం చేయాల్సి వస్తే అందుకు సరిపడా ఆయుధ సంపత్తి మన వద్ద ఉందా..? అంటే ప్రశ్నార్థకమే. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో ఆయుధాల గురించి భారత్ ఈ స్థాయిలో ఏనాడూ ఆలోచించలేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు 6, 7 సంవత్సరాల నుంచే భారత ఆయుధ సంపత్తి పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
అందులోనూ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో సొంతంగా ఆయుధాలను తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత్ ఎటువంటి యుద్ధాలు చేయాల్సి వచ్చినా అవి పూర్తి స్వదేశీ ఆయుధాలతోనే చేస్తుందని వ్యాఖ్యానించారు.
డీఆర్‌డీఓకు సంబంధించి ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బిపిన్ రావత్ మాట్లాడారు. ‘భవిష్యత్తులో యుద్ధం వస్తే భారత్ పూర్తి స్వదేశీ ఆయుధాలతోనే ఆ యుద్ధం చేస్తుంది. అంతేకాదు ఆ యుద్ధంలో విజయ కేతనం ఎగురవేస్తుంది’ అంటూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. భారత ఉత్తర, పశ్చిమ సరిహద్దుల నుంచి దేశం సవాళ్ళు ఎదుర్కొంటున్నట్లు రావత్ పేర్కొన్నారు.
 స్వయం సమృద్ధి వైపు మనం పయనిస్తున్నామని, ఈ దిశలోనే రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ.. డీఆర్‌డీఓ మరింత గట్టిగా కృషి చేయాలని అన్నారు. డీఆర్‌డీఓ మరింత చురుగ్గా కృషి చేయాలన్నారు. త్రివిధ దళాలకు స్వదేశీ పరికరాలను, ఆయుధాలను అందజేయాలన్నారు. ఈ దిశగా డీఆర్‌డీఓ కృషి చేస్తే, భవిష్యత్తులో ఏవైనా యుద్ధాలు వచ్చినా ఎదుర్కోగలమని, దేశ సామర్థ్యాన్ని పెంచుకోగలమని అన్నారు.
ప్రస్తుతం ప్రైవేటు రంగం కూడా రక్షణ పరికరాల ఉత్పత్తికి కృషి చేస్తోందని, ఇది మంచి పరిణామమని, దీనికి కూడా డీఆర్‌డీఓ సహకరించాలని కోరారు. మన దేశ సాయుధ దళాలు స్వయం సమృద్ధి సాధించడంలో సహకరిస్తున్న డీఆర్‌డీఓపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. సవాళ్ళను ఎదుర్కొనడంలో సాయుధ దళాలకు డీఆర్‌డీఓ సాయపడుతోందన్నారు.
దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను ఎదుర్కోవడంలో సాయుధ దళాలు స్వయం సమృద్ధి సాధించగలుగుతున్నాయని, అందుకోసం డీఆర్‌డీఓ కొన్నేళ్లుగా పూర్తి స్థాయిలో చేయూతనందిస్తోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: