నెల్లూరులో ఏలూరు తరహా ఘటన.. వణికిపోయిన అధికారులు..

Deekshitha Reddy
ఏలూరు ఘటనతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక నీటితో గొంతు తడుపుకునేవారు సైతం.. తాగు నీటి విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు. కాచి చల్లార్చుకుని తాగుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో జరిగిన ఓ ఘటన మరోసారి సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా కలువాయి మండలానికి పశ్చిమ బెంగాల్ కి చెందిన కూలీలు వరినాట్లకోసం వచ్చారు. వారిలో దాదాపు 10మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేగింది. ఏలూరు తరహా ఘటన అంటూ ప్రచారం జరిగింది.
అయితే నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు స్థానికంగా అందరూ ఓ బోరు నుంచి నీటిని తాగడమేనని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు అధికారులు. పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన కూలీలంతా ఒకే చోట నీరు తాగడం వల్ల, అది కలుషితమైన నీరు కావడం వల్ల వారు అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. అయితే వారిలో ఒకరు చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఊరు కాని ఊరు వచ్చి తమలో ఒకరు చనిపోవడం, మిగతా వారంతా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండటంతో.. వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏలూరు ఘటన అందరి మనసుల్లో ఉండటంతో.. నెల్లూరు అధికారులు ఇక్కడ వెంటనే చర్యలు తీసుకున్నారు. అందరినీ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత మరికొందరు ఇలాంటి లక్షణాలతోనే ఆస్పత్రిలో చేరడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కేవలం నీరు కలుషితం కావడం వల్లే వలస కూలీలు ఇబ్బంది పడ్డారని, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. ఏలూరు తరహా ఘటన అంటూ నెల్లూరుపై వస్తున్న పుకార్లను కూడా అధికారులు కొట్టిపారేశారు. తప్పుడు వార్తల్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. ప్రస్తుతం నెల్లూరు ఆస్పత్రిలో ఉన్నవారంతా కోలుకుంటున్నారని, జిల్లా వాసులు భయాందోళనలకు గురి కావొద్దని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఇప్పటికే అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: