తుంగభద్ర పుష్కరాలను ఘనంగా ప్రారంభించిన సీఎం జగన్...

SS Marvels
రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలను కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. తొలుత తుంగభద్రమ్మకు సారె, చీర సమర్పించారు. ఈ ఘాట్‌లో 12 రోజుల పాటు హోమం నిర్వహించనున్నారు. అలాగే ప్రధాన ఘాట్లలో సాయంత్రం గంగా హరతి ఇస్తారు. శుక్రవారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ ఓర్వకల్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లోనూ, అనంతరం కారులో తుంగభద్ర నది వరకు ప్రయాణించారు. అక్కడ సీఎం జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. సీఎం వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తెలంగాణలోని అలంపూర్ వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు పుష్కరాలను ప్రారంభించారు. ఇక, 12 ఏళ్లకోసారి 12 రోజుల పాటు జరిగే అది పుష్కరాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అయితే, ఈసారి కోవిడ్- 19 నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. సాధారణంగా పుష్కరాలంటే నదీ స్నానాల సందడి ఉంటుంది. ఈసారి కరోనా కారణంగా పుణ్యస్నానాలకు అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది గుమికూడే ప్రమాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నదీ స్నానాలు నిషేధించింది. కనీసం జల్లు స్నానాలకు కూడా అనుమతించలేదు. పూజాది కార్యక్రమాలు, పిండ ప్రదానాలు చేసేందుకు మాత్రం అనుమతించింది. పదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, వృద్దులు పుష్కరాలకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. ఐదు వేల మంది పోలీసులు బందోబస్తుతో పాటు... పుష్కర ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. నది వెంబడి బారికేడ్లను ఏర్పాటుచేసి, భక్తులు నదిలోకి దిగకుండా జాలీలను ఉంచారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన తుంగభద్ర నదికి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు 12రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. 12 ఏళ్లకు ఓసారి వచ్చే పుష్కరాలకు తుంగభద్ర నది సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 2008లో జరిగిన తుంగభద్ర పుష్కరాలలో 50లక్షల మంది భక్తులు కర్నూలు జిల్లాలో పుణ్యస్నానాలు ఆచరించారు. మరి ఇప్పుడు జరుగుతున్న పుష్కరాలపై ఈ కరోనా ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: