బ్యాంకులకు ఆర్ బీఐ హెచ్చరిక..!

NAGARJUNA NAKKA
బ్యాంకులకు కొత్త కష్టాలొచ్చిపడ్డాయ్‌. ఇప్పటికే మొండి బాకీలు వసూలు చేయలేక అష్టకష్టాలు పడుతున్న బ్యాంకులపై మరో భారం పడింది. క్రెడిట్‌ కార్డుల రూపంలో కొత్త చిక్కులు వచ్చాయి. ఏకంగా లక్ష కోట్ల బాకీలు నెత్తిన చుట్టుకున్నాయి‌. చెల్లించని క్రెడిట్‌ కార్డుల బిల్లు ఏకంగా లక్ష కోట్లు ఉన్నట్లు ప్రకటించింది ఆర్‌బీఐ. ఇది బ్యాంకులకు ప్రమాదకర సంకేతమే అని హెచ్చరిస్తోంది.
కరోనా ఏ రంగాన్ని వదల్లేదు. ఈ మహమ్మారి  తెచ్చిన కష్టాల్లో కరెన్సీ కష్టాలే ఎక్కువ. కరోనా సోకితే.. 14 రోజులు క్వారంటైన్‌ ఉన్నా తగ్గిందేమో కానీ.. ఆర్థిక కష్టాలు మాత్రం ఏళ్లు గడిచినా తీరేలా లేవు. లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు ఊడి.. పనుల్లేక.. జీతాల్లో కోతలతో... ఉన్నోడు లేనోడు అనేతేడా లేకుండా అందరి ఖాతాలు ఖాళీ అయ్యాయి. దీంతో.. వేరేదారి లేక క్రెడిట్‌ కార్డులను ఎడాపెడా గీకేశారు జనాలు. సాధారణంగానే క్రెడిట్‌ కార్డు వాడకం ఎక్కువ. ఇక లాక్‌డౌన్‌లో వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో.. క్రెడిట్‌ కార్డు వాడకం మరింత రెట్టింపైంది.
అసలే మొండి బకాయిల దెబ్బకి బ్యాంకులు అల్లాడిపోతున్నాయి. అలాంటి బ్యాంకులపై ఇప్పుడు క్రెడిట్‌ కార్డు రుణాల భారం కూడా పడింది. భారీ ఎత్తున క్రెడిట్‌ కార్డు రుణాలు ముప్పులో పడ్డాయని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది. ఈ మొత్తం దాదాపు లక్ష కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది.  ఆర్‌బీఐ విధించిన మారిటోరియంతో క్రెడిట్‌ కార్డు లబ్ధిదారులు ఆరునెలలుగా బిల్లులు చెల్లించడం లేదు.
ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం బ్యాంకులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఈ వ్యాపార వృద్ధిరేటు 3 శాతం ఉంది. అదే సమయంలో రావాల్సిన బకాయిలు లక్ష కోట్లుగా ఉన్నాయి. రుణాల్లో ఎగవేతలు ఎక్కువగా ఉండటంతో వృద్ధిరేటు తగ్గిపోయింది. ఇటీవల ప్రభుత్వ మారటోరియం ఉపయోగించుకొన్న వాటిల్లో 5శాతం వరకు రుణాలు తిరిగి రాకపోవచ్చని ఆ సంస్థ అంచనావేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: