మీడియా మంటలు: ఆ ఛానల్, ఆ వెబ్‌ సైట్‌, టీడీపీ నేతకు నోటీసులు పంపిన మంత్రి..!

Chakravarthi Kalyan
తెలుగు రాష్టాల్లో మీడియా పార్టీల వారీగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఒక్క తెలుగురాష్ట్రాలు అనే ఏముంది.. జాతీయ స్థాయిలోనూ ఒక్కో మీడియా ఒక్కో పార్టీని సపోర్టు చేసేలా మారిపోయాయి. ఇది మీడియాలో వస్తున్న మార్పుగా తీసుకోక తప్పని పరిస్థితి. ఏ పార్టీకి కొమ్ముకాయని.. ఏ పార్టీని సపోర్టు చేయని.. అచ్చమైన జర్నలిజం ఆధారంగా వస్తున్న మీడియా ఏదంటే.. సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఏవో ఒకటి, రెండు మీడియాలను మినహాయిస్తే.. అన్నీ అలాగే తయారయ్యాయి.

ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ఇప్పుడు పాతకాలంలోలాగా మీడియాను లైట్‌ గా తీసుకోవడం లేదు. చేతిలో పెన్ను ఉంది కదా అని మీడియా తప్పుడు వార్తలు రాస్తే.. మేం కోర్టులకు వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తాం అంటున్నారు నాయకులు కూడా.  ఇప్పుడు తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అదే పని చేశారు. ఆ మధ్య కొన్నాళ్ల క్రితం.. తమిళనాడులో ఓ కారులో భారీ గా కోట్లలో నగదు దొరికిందని.. అది ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది అని ప్రచారం జరిగింది. కొన్ని ఛానళ్లు, పత్రికలు నేరుగా అది నిజమే అన్నట్టు వార్తలు ఇచ్చాయి.

ఈ వార్తల ఆధారంగా నారా లోకేశ్ వంటి టీడీపీ నేతలు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఇప్పుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వీరందిపై చట్టపరంగా చర్య తీసుకోబోతున్నారు. టీడీపీ నేత నారా లోకేశ్‌కు బాలినేని శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసు పంపించారు. ఆయనతో పాటు తనపై ప్రచారం చేసిన వార్తా చానళ్లకు కూడా ఆయన నోటీసులు ఇచ్చారు. టీవీ5, న్యూస్‌18 మీడియాలకు ఆయన లీగల్ నోటీసులు పంపినట్టు తెలిసింది.

టీవీ5, న్యూస్‌18 మీడియాల్లో వార్తలు వచ్చిన వెంటనే వాటిని మంత్రి బాలినేని ఖండించారు. ఇప్పుడు టీవీ 5, న్యూస్ 18 తో పాటు తప్పుడు వార్తలను ప్రచారం చేయింటారంటూ నారా లోకేష్‌, బొండా ఉమా, కొమ్మరెడ్డి పట్టాభిలకు లీగల్ నోటీసులు పంపించారట. విచిత్రం ఏంటంటే దొరికిన డబ్బు నాదే అంటూ ఓ బంగారం వ్యాపారి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ నేతలు, ఛానళ్లు బాలినేనిదే అంటూ ప్రచారం చేశాయట. మరి ఈ నాయకులు, మీడియా సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: