చంద్రబాబు పై కేసు గిన్నిస్ రికార్డే ? బీజేపీ చురకలు !

కేంద్ర బీజేపీ పెద్దలకు తరచుగా లేఖలు రాస్తూ, ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా, ఆ పార్టీ నాయకులు మాత్రం బాబుని, టిడిపిని దూరం పెట్టే విధంగానే వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు టిడిపిలో కలవరం పుట్టిస్తున్నాయి. టీడీపీ అనుకూల వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ.. వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధింపులకు పాల్పడుతుంది అనే అభిప్రాయంలో బాబు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. ముందుగా జడ్జిల ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు రావడం, ఆ తర్వాత వైసిపి అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం తన ఫోన్ ను సైతం ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్నారంటూ, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోం శాఖకు
 ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే, టీడీపీ ముఖ్య నాయకుల ఫోన్ సంభాషణలను ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ట్యాప్ చేస్తోందని, ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పని చేస్తోందంటూ చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, మరే ఇతర అంశాల్లో కానీ, కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన తేల్చి చెప్పారు. అంతే కాదు ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ కేంద్రానికి బాబు లేఖ రాశారు. కానీ అందులో ఎవరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే విషయాన్ని పూర్తిగా వివరించలేదని చెప్పుకొచ్చారు.
 ఈ సందర్భంగా కోర్టు వ్యవహారంపై స్పందిస్తూ, టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రస్తుత వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి వేసిన అక్రమాస్తుల కేసుపై 14 ఏళ్లుగా స్టే కొనసాగుతుండడంపై జీవీఎల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజంగా ఇది గిన్నిస్ రికార్డు అంటూ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినా ఉపయోగం లేదని, ఈ వ్యవహారాలను కోర్టులు చూసుకుంటాయి అంటూ జీవీఎల్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి పైన జీవీఎల్ సెటైర్లు వేశారు. చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసు సిబిఐతో విచారణ చేయించాలని లక్ష్మీపార్వతి కేంద్రానికి లేఖ రాయడంపై జీవీఎల్ స్పందించారు. కేంద్రానికి లేఖ రాస్తే ప్రయోజనం ఉండదని, ఈ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాస్తే, ఆయన దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: