కన్నెర్ర జేసిన కృష్ణమ్మ..!

NAGARJUNA NAKKA
కృష్ణమ్మ మళ్లీ కన్నెర్ర చేసింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తింది. పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాలు, పంట పొలాలను ముంచెత్తుతోంది. వరద మరింత పెరిగే అవకాశం ఉండంటంతో అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తింది. కర్నాటక అడ్డుకట్టల్ని దాటి తెలుగు నేలకు జలసిరులు మోసుకొస్తోంది. జూరాల, తుంగభద్ర డ్యాంల నుంచి శ్రీశైలానికి భారీగా వరద వస్తోంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ డ్యాంలు నిండాలంటే ఇంకో వారం రోజులు ఇదే స్థాయిలో వరద కొనసాగాల్సి ఉంది. ఇప్పటికే కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండిపోయాయ్. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు కూడా నిండి.. శ్రీశైలంవైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.

కృష్ణా నదికి భారీ వరద వస్తుండటంతో.. శ్రీశైలం ప్రాజెక్టు రెండు మూడు రోజుల్లోనే నిండే అవకాశం ఉంది. తుంగభద్ర జలాశయం నీటి నిల్వ 98 టీఎంసీలకు చేరుకోవడంతో ఆదివారం రాత్రి 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. బళ్లారి, కర్నూలు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.
శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరద చేరుతోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా,  ప్రస్తుతం 870 అడుగులకు చేరింది.
ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి లక్షా 20 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దొడ్డదేవపాడు కాజ్‌వేపై నుంచి నీరు ప్రవహిస్తోంది. చిలుకూరు-పల్లెంపల్లి, నందిగామ మధ్య రాకపోకలు నిలిపోయాయి.

మొత్తానికి కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు అల్లకల్లోలంగా తయారయ్యాయి. సమీప గ్రామాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. వరద బాధిత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: