జ‌గ‌న్ నిర్ణ‌యం...క‌రోనా టైంలో భలే భ‌రోసా

Pradhyumna

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. పేషంట్ల విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని కలెక్టర్లకు వివరించారు. కరోనా నివారణ చర్యలపై కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి అధికారి సీరియస్‌గా పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో కరోనా పేషంట్‌కు హాస్పిటల్‌లో 30 నిమిషాల్లోనే బెడ్‌ కేటాయించాలని అన్నారు. ఆస్ప‌త్రుల్లో బెడ్లను సమర్థంగా వినియోగించుకోవాలని, బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, అత్యవసర సేవలు, సదుపాయాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని అన్నారు. దీని కోసం ఎంత ఖర్చు అయినా వెనుకడుగు వేయొద్దని స్పష్టం చేశారు. కాల్‌ సెంటర్లు సమర్థవంతంగా పనిచేయాలని, వాటికి వచ్చే సమాచారం ఆధారంగా వెంటనే స్పందించాలని సీఎం జ‌గ‌న్ అన్నారు.

 


ప్రతి కరోనా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌, అవసరాలకు సరిపడ సిబ్బంది, భోజనం, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో కంప్లైంట్లకు 1902 నంబర్‌ను ఉంచాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నప్పుడు సహజంగానే భయపడతారు, కేసులు సంఖ్య తగ్గించి చూపే ప్రయత్నం చేస్తారు, కానీ ప్రభుత్వం ఎక్కడా అలాంటి వాటికి తావు ఇవ్వలేదని జగన్‌ అన్నారు. రికార్డు స్థాయిలో ఒకరోజుకు 50 వేలకు పైగా టెస్టులు చేస్తున్నామని, దేశంలోనే ఇది అత్యధికమని సీఎం చెప్పారు. ప్రతి 10 లక్షల మంది జనాభాలో 31 వేల మందికి పైగా టెస్టులు చేస్తున్నారు. ఈ టెస్టులు కూడా వైరస్‌ వ్యాప్తి ఉన్న క్లస్టర్లలో చేస్తున్నాం. పాజిటివ్‌ కేసులను వీలైనంత త్వరగా గుర్తించి, వారి కాంటాక్టులను ట్రేస్‌ చేయడం, పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అధికారులంతా బాగా పని చేశారు కాబట్టే ఇంత మంచి కార్యక్రమాలు చేయగలిగామని సీఎం చెప్పారు. కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఇప్పుడున్నాయన్నారు.

 

‘‘కరోనా వస్తుంది, పోతుంది కూడా. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం వేచిచూడాలి. అలాగే మన దగ్గర లక్షకు పైగా కేసులు నమోదైతే అందులో సగం మందికి పైగా నయం అయిపోయి ఇళ్లకు కూడా వెళ్లిపోయారు. అలాగే నమోదవుతున్న కేసుల్లో 85 శాతం మందికి ఇళ్లలోనే నయం అవుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా మరణాల రేటు దాదాపు 2.5 శాతం ఉంటే మన దగ్గర 1.06 శాతం ఉంది. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అయింది. పెద్ద రాష్ట్రాల లాగా మన దగ్గర అత్యాధునిక ఆస్పత్రులు లేకపోయినప్పటికీ మరణాల రేటును 1.06 శాతానికి పరిమితం చేయగలిగాం. ఇది మనం సాధించిన విజయంగా చెప్పొచ్చు’’ అని సీఎం అన్నారు. కాని, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నారు. కరోనా పాజిటివ్‌ వస్తే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జగ‌న్‌‌ అన్నారు. కరోనా కారణంగా మరణించిన వారి విషయంలో ఈ మధ్య జరిగిన ఘటనపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఎవరైనా చనిపోతే రూ.15వేలు ఇవ్వాలని, బంధువులెవరైనా రాకపోతే ప్రభుత్వమే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తుందని సీఎం స్పష్టం చేశారు. వర్షాకాలం ప్రారంభం అయ్యిందని, సీజన్‌ వ్యాధులు వస్తాయని, డయేరియా, డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా లాంటి జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్స్‌కు కేవలం కరోనా కోసమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యల గురించి ఎవరైనా కాల్‌చేస్తే వెంటనే చర్యలు తీసుకునేలా ఉండాలన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగ్గా నిర్వహించాలని, ఇది కూడా చాలా ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమమని సీఎం స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: