ఏపీలో పాఠశాలల ప్రారంభం అప్పుడే... స్పష్టం చేసిన జగన్...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇతర రంగాలతో పోలిస్తే విద్యా రంగంపై వైరస్ ప్రభావం ఎక్కువగా పడింది. మార్చి నెల మూడవ వారం నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతబడ్డాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా సీఎం జగన్ పాఠశాలల ప్రారంభం గురించి స్పష్టత ఇచ్చారు. 
 
నేడు జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 31వ తేదీ నాటికి స్కూళ్లలో నాడు నేడు పనులు పూర్తి కావాలని జగన్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి కారణంగా మూసివేసిన స్కూళ్లు సెప్టెంబర్ 5న ప్రారంభమవుతాయని సీఎం చెప్పారు. సీఎం జగన్ ఈ సమీక్షలో కరోనా పరిస్థితులు, ఇతర విషయాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. కౌలు రైతులకు సకాలంలో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన సాగు ఒప్పందాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం అన్నారు. రైతులు పంటల సాగులో వచ్చే సమస్యల గురించి పరిష్కారాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 155251 ను ఉపయోగించుకోవాలని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నామని అన్నారు. పట్టాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు.                   
 
కొనుగోలుదారులు ఆర్డర్ చేసిన 72 గంటల్లో ఇసుక ఇంటికి చేరాలని సీఎం సూచించారు. అవకాశం ఉన్న చోట ఇసుకను తవ్వి నిల్వ చేయాలని... ఇసుకకు సంబంధించిన ఫిర్యాదులు రాకుండా నాణ్యమైన ఇసుక పంపిణీ జరిగేలా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణ కోసం స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: