కరోనా కేసులపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు... తెలంగాణ సీఎంను టార్గెట్ చేశారా....?

Reddy P Rajasekhar

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా కరోనా నివారణ చర్యలు, జిల్లాల పరిస్థితి గురించి చర్చించారు. సీఎం జగన్ ప్రతి అధికారి కరోనా కట్టడి కోసం ఎంతో కృషి చేస్తున్నారని... కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో రోజుకు 50 వేలకు పైగా కరోనా పరీక్షలు జరుపుతున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని తెలిపారు. 
 
సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నా వాటిని తక్కువగా చూపే ప్రయత్నం చేయడం లేదని చెప్పారు. ప్రతి మిలియన్ కు 31 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని... 90 శాతం పరీక్షలు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటినా కోలుకున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉందని తెలిపారు. లక్షకు పైగా కేసులు నమోదైనా సగం మందికి నయమైందని చెప్పారు. 
 
దేశంలో కరోనా మరణాల రేటు 2.5 శాతంగా ఉండగా రాష్ట్రంలో 1.06 శాతమని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఎదురు చూడక తప్పదని... కరోనాతో చనిపోయిన వాళ్లలో కొన్ని గంటల తర్వాత వైరస్ ఉండదని తెలిపారు. కరోనాపై ఎవరికీ భయాందోళనలు ఉండకూడదని అన్నారు. 85 శాతం మందికి కరోనా ఇళ్లలోనే నయమైందని చెప్పారు. కరోనా గురించి ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. 
 
సీఎం జగన్ నేడు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. కేసులు ఎక్కువగా వస్తున్నాయని భయపడి, పరీక్షలు తగ్గించి.. రిపోర్టుల్లో తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తారని... మన రాష్ట్రంలో అలా చేయడం లేదని అన్నారు. సీఎం జగన్ తెలంగాణలోని పరిస్థితులను ప్రస్తావించారని రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారనే విమర్శలున్నాయి. జగన్ అందువల్లే ఈ వ్యాఖ్యలు చేశారా...? ఇతర కారణాల వల్ల చేశారా...? తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: