బుచ్చయ్యలో ఫైర్ తగ్గలేదా? నెక్స్ట్ బాబు కాదంటే కష్టమేనా?

M N Amaleswara rao

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఆ పార్టీకి వీరవిధేయులుగా పనిచేస్తున్న నాయకుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరీ కూడా ఒకరు. ఎన్టీఆర్ మీద అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చిన బుచ్చయ్య...వరుసగా ఆరుసార్లు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఎన్టీఆర్‌ని గద్దె దించేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన సమయంలో బుచ్చయ్య ఎన్టీఆర్ వైపే నిలబడ్డారు.

 

కానీ తర్వాత ఎన్టీఆర్ మరణించడం, చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. టీడీపీలో ఉన్నా సరే చంద్రబాబు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే వ్యతిరేకించేవాళ్లలో బుచ్చయ్య ముందుంటారు. 2014లో గెలిచి అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా బుచ్చయ్య...వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలని చేర్చుకోవద్దని బాబుకు అంతర్గతంగా సలహా కూడా ఇచ్చారట.

 

అలా సొంత నేతలకు అన్యాయం చేస్తూ...వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలని చేర్చుకోవడం వల్ల పార్టీకి భారీ నష్టం జరుగుతుందని ముందే చెప్పారట. బాబు మాత్రం బుచ్చయ్య మాటలని పట్టించుకోకుండా ఎమ్మెల్యేలని చేర్చుకున్నారు. బుచ్చయ్య చెప్పినట్లే పార్టీకి పెద్ద బొక్క పడింది. ఇప్పుడు ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.

 

ప్రతిపక్షానికి పరిమితమైన సరే ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య ఎక్కడా తగ్గట్లేదు. ప్రతిరోజూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూనే ఉంటున్నారు. వయసు మీద పడినా కూడా తనలో ఫైర్ తగ్గలేదని నిరూపిస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో బుచ్చయ్య మళ్ళీ పోటీ చేయనని చెప్పారు. కానీ ఎన్నికలైపోయాక మాత్రం బుచ్చయ్య అభిప్రాయం మార్చుకున్నారని తెలుస్తోంది.

 

నెక్స్ట్ పోటీకి దిగాలని అనుకుంటున్నారని, అప్పుడు తాను గెలిచి, పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి తీసుకోవాలనే పట్టుదలతో బుచ్చయ్య ఉన్నట్లు సమాచారం. మంత్రి పదవి దక్కించుకుని వైఎస్సార్‌సీపీకి చుక్కలు చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారట. ఒకవేళ బాబు కాదంటే సంచలన నిర్ణయం తీసుకోవడానికి కూడా బుచ్చయ్య వెనుకాడరని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: