క్రెడిట్‌ కార్డు ఇస్తామంటూ నిలువు దోపిడీ..!

Kothuru Ram Kumar

టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ బాధితుల సంఖ్యా పెరుగుతూనే ఉంది. రోజుకు ఎదో ఒక్క ప్రాంతంలో సైబర్ ఆగడాలకు ఎవరో ఒక్కరు బలి అవుతూనే ఉన్నారు. క్రెడిట్‌ కార్డు కావాలా నాయనా అంటూ కమ్మగా మాట్లాడిన సైబర్‌ మోసగాళ్లు.. ఓ ప్రైవేట్‌ ఉద్యోగిని నిలువు దోపిడీ చేశారు. 

 

 

వివరాల్లోకి వెళ్తే... సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి మెడికల్‌ షాపులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇటీవల ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి మీకు లక్ష రూపాయల విలువ చేసే క్రెడిట్‌ కార్డు ఇస్తామని ఊరించాడు. మీరు ఒకే అంటే నిమిషాల్లో కార్డు జారీ అయిపోతుందని నమ్మబలికాడు.

 

 

లక్ష రూపాయల క్రెడిట్‌ కార్డు వస్తే తనకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని భావించి ఓకే అనేశాడు. క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగానే.. కార్డును జారీ చేస్తామని చెప్పిన మేరకు చేసిన తర్వాత ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన పిన్‌ నంబర్లు, పాస్‌వర్డులను టైప్‌ చేశాడు.

 


క్విక్‌సపోర్ట్‌ యాప్‌ ద్వారా సైబర్‌ దొంగ పరిశీలించి 15 నిమిషాల్లో బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.3 లక్షలు కాజేశాడు. నగదు విత్‌డ్రా అయినట్లు సమాచారం అందగానే మోసపోయానని గ్రహించిన సదరు వ్యక్తి లబోదిబోమంటూ సైబరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. 

 

 

రూపాయి నుంచి రూ.10 వరకు బ్యాంకు నుంచి ఫోన్‌పే, గూగుల్‌ పే లేదా పేటీఎం వ్యాలెట్‌లోకి బదిలీ చేయమని సూచిస్తారు. చాలా మంది ఇక్కడే మోసపోతున్నారు. మన వ్యాలెట్‌లోకే కదా పంపించేది అంటూ ముందుకువెనుకా ఆలోచించకుండా అడుగు ముందుకేస్తున్నారు.

 

 

డబ్బు బదిలీకి క్రెడిట్‌/డెబిట్‌ కార్డు నంబర్‌, పిన్‌, ఇతరత్రా సమాచారాన్ని నమోదు చేస్తుంటే ఎక్కడో ఉన్న కేటుగాళ్లు రిమోట్‌ యాప్‌ల సాయంతో చూస్తున్నారు. ఆ సమాచారం సాయంతో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. లావాదేవీలు జరిగినట్లు ఎస్‌ఎంఎస్‌లు వస్తుండటంతో బాధితులు లబోదిబోమంటూ బ్యాంకులను సంప్రదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: