నడిచి.. నడిచి.. విసిగిపోయే ఆత్మహత్య చేసుకున్నారా.. ?

NAGARJUNA NAKKA

మహారాష్ట్ర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఔరంగాబాద్ జల్నా మధ్యలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. పట్టాల మీద నిద్రిస్తున్న ఛత్తీస్‌ఘడ్‌ వలస కార్మికులు  ఈ ఘటనలో బలయ్యారు.

 

శుక్రవారం ఉదయం ఆరున్నరకు ఈ ప్రమాదం జరిగింది. లాక్ డౌన్ వల్ల స్వస్థలాలకు వెళ్లడానికి వాహనాలు లేక ట్రాక్ పై నడుచుకుంటూ కొంతమంది వలస కూలీలు చత్తీస్ ఘడ్ వెళ్తున్నారు. వారు ఔరంగాబాద్ దగ్గరకు చేరుకోగానే రాత్రి కావడంతో వారంతా ట్రాక్ పైనే పడుకున్నారు. లాక్ డౌన్  సమయంలో రైళ్లు రావని భావించారు.

 

కానీ ఉదయాన్నే దూసుకొచ్చిన గూడ్స్ రైలు 16మంది ఉసురు తీసింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. ఔరంగాబాద్ ఆసుపత్రికి బాధితులను తరలించారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు.

 

ట్రాక్ పై నిద్రిస్తున్న కూలీలను గమనించిన లోకోపైలట్ రైలును ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని సమాచారం. దీంతో క్షణాల్లోనే ప్రమాదం జరిగిందని రైల్వేశాఖ తెలిపింది. ఈ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

 

మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారంగా ఐదు లక్షలు చెల్లిస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్సకయ్యే ఖర్చు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన ప్రకటించారు. మృతులంతా జాల్నాలోని స్టీల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ముంబైసహా, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలనుండి గత నాలుగైదు రోజుల్లో దాదాపు లక్షమంది కార్మికులు సొంత రాష్ట్రాలకు చేరుకున్నారని సమాచారం. 

 

అయితే ఇది ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సొంత ఊర్లకు వెళ్ళలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కూడా స్థానిక అధికారులు భావిస్తున్నారు. నడిచి నడిచి విసిగిపోయి ఉంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: