ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం.... రైల్వే ట్రాక్ పై చెల్లాచెదురుగా వలసకూలీల మృతదేహాలు... ?

Reddy P Rajasekhar

దేశంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన మరవక ముందే ఔరంగాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది వలస కూలీలు నిద్రలోనే కన్నుమూశారు. రెక్కాడితే కానీ డొక్కాడని వలస కూలీలు లాక్ డౌన్ వల్ల పట్టాలపై నిద్రించినట్టు సమాచారం. కార్మికులు కాలి నడకన స్వస్థలాలకు వెళుతున్నట్టు సమాచారం. 
 
చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా రైల్వే ట్రాక్ పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కలచివేశాయి. ఈరోజు ఉదయం 6.30 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతి చెందిన వలసకూలీలు మధ్యప్రదేశ్‌కు తిరిగి వెళ్తున్నారని కర్మాడ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. 
 
రైలు పట్టాల వెంట నడుస్తూ బయలుదేరిన కార్మికులు అలసట వల్ల ట్రాక్ పై నిద్రపోయారని తెలుస్తోంది. రైళ్ల రాకపోకలపై కేంద్రం ఆంక్షలు విధించిందని వలస కూలీలు రైలు పట్టాలపై నిద్రించారని సమాచారం. కర్మద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జౌరంగాబాద్‌-జల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన కార్మికులు జల్నాలోని ఐరన్‌ ఫ్యాక్టరీలో పనిచేసే వలస కూలీలుగా అధికారులు గుర్తించారు. 
 
ఘటన స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్‌, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వలస కూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. కేంద్రం శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని సొంతూళ్లకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొందరు వలసకూలీలు మాత్రం కాలికడకన సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.                        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: