తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పరిస్థితి ఇదీ.. !

NAGARJUNA NAKKA

నెల రోజులకు పైగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం భారీగా తగ్గింది. వ్యాపార, వాణిజ్యసంస్థలు, దుకాణాలు, పలు పరిశ్రమలు మూసివేయడంతో గరిష్ఠ డిమాండ్‌లో సుమారు 20గిగావాట్ల విద్యుత్‌ తగ్గినట్లు తెలుస్తోంది. అయితే గృహ సంబంధమైన విద్యుత్‌ వినియోగం, డిమాండ్‌ మాత్రం భారీగా పెరిగినట్టు చెబుతున్నాయి గణాంకాలు.

 

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్ భారీగా పడిపోతోంది. లాక్‌డౌన్‌లో వినియోగం తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు విద్యుత్ అధికారులు. సాధారణంగా వేసవిలో పరిశ్రమలు, పంటల సాగు కోసం అధిక డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య సంస్థలన్నీ మూతపడటంతో విద్యుత్‌ వినియోగం నిలిచిపోయింది. వరి కోతలు పూర్తవడంతో వ్యవసాయ కనెక్షన్లకు వాడకం తగ్గిపోయింది. అయితే ప్రస్తుతం గృహ విద్యుత్‌ వినియోగం మాత్రమే ఉందని తెలుస్తోంది. గత నెల 21న ఒకరోజు గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 11,541 మెగావాట్లు ఉండగా.. మంగళవారం సాయంత్రం ఏడాదిలోనే కనిష్ఠంగా 4,147 మెగావాట్లు నమోదైంది. 

 

విద్యుత్ వినియోగం తగ్గిపోవడం ఒక్క తెలంగాణ రాష్టానికే పరిమితం కాలేదు. సౌత్ గ్రిడ్‌లోనూ దాదాపు 8వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ తగ్గింది. తెలంగాణలో 1500 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ పడిపోగా.. హైదరాబాద్‌ పరిధిలో 500 మెగావాట్ల వరకు తక్కువయింది. రాష్ట్రంలో వినియోగిస్తున్న విద్యుత్‌లో దాదాపు 37 శాతం వ్యవసాయ రంగానికే వాడుతున్నట్టు విద్యుత్‌ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈనెల 24న గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 9,832 మెగావాట్లుగా నమోదు అయ్యింది. ఈ వేసవిలో దాదాపు 38 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయడం.. భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉండటంతో రైతులు విద్యుత్‌ను భారీగా వినియోగిస్తున్నారు. పంటలు చివరిదశకు చేరడంతో మరో పక్షం రోజులు ఇలాగే ఉండే అవకావం ఉన్నదని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

 

గత మార్చి నెలలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కరెంట్  డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి 28న ఉదయం 7గంటల 52నిమిషాలకు రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,168 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల అత్యధిక డిమాండ్‌ నమోదు కాగా ప్రస్తుతం ఆ రికార్డు చెరిగిపోయింది. కాగా తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో పెరుగగా... లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి భారీగా తగ్గుతూ వస్తోంది. 

 

ప్రస్తుతం విద్యుత్‌కు డిమాండు లేకపోవడంతో సింగరేణి ప్లాంటులో ఉత్పత్తి నిలిపివేశారు. భూపాలపల్లిలో 500 మెగావాట్లు, మంచిర్యాల జిల్లా జైపుర్‌లో 500 మెగావాట్లు ఉత్పత్తి తగ్గించారు. మిగతా థర్మల్‌ కేంద్రాల్లోనూ విద్యుత్‌ ఉత్పత్తి కుదించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: