ఔనూ బొత్సగారూ!రాహూల్ ఎవ్వరూ...ఝాన్సీ ఎవ్వరూ...

 హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వదనీ పీసీసీ చీఫ్ బొత్స చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కార్యకర్తలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. స్వర్గీయ ఇందిరాగాంధీ మొదలుకుని నేటి రాహూల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నది వారసులు కాక మరెవరూ? అంతెందుకు విజయనగరం జిల్లా నుంచి పార్లమెంటు సభ్యురాలుగా పని చేస్తున్న బొత్స ఝాన్సీ ఎవరో మాన్యులైన బొత్సగారు సెలవిస్తే బాగుంటుంది. నెహ్రూ వారసురాలిగా ఇందిర వచ్చారు. ఇందిర వారసునిగా రాజీవ్ వచ్చారు. రాజీవ్ వారసత్వంగా ఆయన భార్య సోనియా వచ్చారు. ఈమె వారసునిగా రాహూల్ గాంధీ వచ్చారు. రేపోమాపో ఆమె కూతరు ప్రియాంకను తెచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.  నెహ్రూ కుటుంబాన్ని పక్కనబెడితే... పీసీసీ నేత బొత్స కుటుంబాన్ని తీసుకుందాం...బొత్స ఎమ్మెల్యేగా ఉండగా...ఆయన భార్య బొత్స ఝాన్సీని ఎంపీగా చేశారు. దీనిని వారసత్వం కాక మరేమంటారో బొత్సనే చెబుతే బాగుంటుంది. తండ్రి తరువాత తల్లీ, తల్లీ తరువాత పిల్లలు, కోడళ్లు, మనువరాండ్రు వస్తుండటం వారసత్వమనీ పీసీసీ హోదాలో ఉన్న బొత్సకు తెలియకపోవడం ఆశ్చర్యం అనిపిస్తోంది. నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. రాష్ర్టంలో అనేక మంది నేతలకు వారసులుగా వారి పిల్లలు, భార్యలు వచ్చారు. దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారసులుగా ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కోడలు కోట్ల సుజాతమ్మ వచ్చారు.  మరో స్వర్గీయ సీఎం మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. దివంగత మాజీ సీఎల్పీ లీడర్ పీజేఆర్ కుమారుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. మరో మాజీ స్పీకర్ శ్రీపాదరావు కుమారుడు శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు. అంతెందుకు ప్రస్తుత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన తండ్రి వారసత్వంగానే ఎమ్మెల్యేగా వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే...కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వారసత్వ రాజకీయాలు మరే పార్టీలో లేవనీ చెప్పాలి. ఇవన్నీ మరిచి బొత్సగారు కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వదనీ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బొత్స చెప్పినదాంట్లో ఒకటి నిజం వుంది. అదేంటంటే....పార్టీ కోసం దశాబ్దాల తరబడిగా పనిచేస్తున్న కార్యకర్తల పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వరనేదీ వాస్తవం. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందనీ కూడా సెలవిచ్చారు. పార్టీ కోసం సర్వస్వం కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. వరుసగా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుంచీ ఎమ్మెల్యేగా గెలిచిన కొడకండ్ల సైదయ్య మరణాంతరం ఆయన కుటుంబ సభ్యులకు ఉండటానికి గూడు, గుడ్డ లేని పరిస్థితి. ఈయనకెవరూ వారసులు లేరు. వారసులున్న వారందరూ ఆర్థికంగా అందనంత ఎత్తు ఎదిగారు. దశాబ్దాల తరబడిగా పార్టీ కోసం పని చేస్తున్న వారికీ కనీసం కార్పోరేటర్ టికెట్ కూడా దక్కలేదు. వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చేయదడనం బొత్సకే చెల్లిందనీ కాంగ్రెస్ లోని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: