పోలీసుల‌కు సజ్జ‌నార్ కీల‌క‌ ఆదేశాలు... తేడా రానివ్వ‌కండి అంటూ

Pradhyumna

ఇటీవల హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో దిశ అనే అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు నిందితులను అనివార్య కారణాల వల్ల సైబరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌ జరిగిన నాటి నుంచి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పేరు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ మారుమోగుతోంది. కరుడుగట్టిన నిందితులకు సరైన శిక్ష విధించారని పోలీసులను ప్రజలు ప్రశంసించారు. సీపీ సజ్జనార్ కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్న స‌మ‌యంలో...ఆయ‌న‌తో సెల్పీలు దిగేందుకు ప్ర‌జ‌లు పోటీ ప‌డ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. అయితే, తాజాగా పోలీసుల‌కు స‌జ్జ‌నార్ కీల‌క ఆదేశాలు ఇచ్చారు.

 

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో  ఇంటర్ అపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి సీసీటీఎన్‌ఎస్ ఆపరేటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ..ప‌లు ముఖ్య‌మైన సూచ‌న‌లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ అపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అమలుకు వచ్చిన నేపథ్యంలో ఫిర్యాదు నుంచి చార్జిషీటు వరకు సంబంధించిన అంశాలు సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని వివరించారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునే సమయంలో చాలా మర్యాదగా ఉండాలని, వారి నుంచి తీసుకునే సమాచారంలో స్పష్టత ఉండాలని సూచించారు. అదే విధంగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదులో ఎలాంటి అంశాలు పాటించాలనే వాటిని సజ్జనార్ వివరించారు.

 


కాగా, న‌వంబ‌ర్ 27వ తేదీన‌ వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశ రేప్‌, ద‌హ‌నం కేసు అత్యంత సున్నితంగా మారింది. నిందితుల‌ను కేవ‌లం కొన్ని గంట‌ల్లోనే అరెస్టు చేశారు. నిందితుల‌ను షాద్‌న‌గ‌ర్ పీఎస్‌కు తీసుకువ‌చ్చిన స‌మ‌యంలో జ‌నం వేల సంఖ్య‌లో ఎగ‌బ‌డ్డారు. నిందితుల‌ను అప్ప‌గిస్తే .. ప‌రిష్కారం మేమే చూపిస్తామంటూ జ‌నం ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేశారు. అయినా పోలీసులు వారిని చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు. అయితే క్రైమ్ సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ కోసం నిందితులను తీసుకువెళ్ల‌గా వాళ్లు తిర‌గ‌బ‌డ్డారు. దీంతో పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. దిశ ఆత్మ‌కు శాంతి చేకూరింద‌ని ఎంద‌రో ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: