ఈ పాపం ఎవరిది. ఇలాగైతే సామాన్యుడు బ్రతికేదేలా..??

venugopal

ఒకప్పుడు సామాన్యునికి సరిపడా ఆదాయం లేదు. అయినా కడుపునిండా తిని, కంటినిండా నిదురించే వాడు. సమాజంలో వచ్చిన మార్పుల వల్ల పేదవారు కూడా అంతో ఇంతో సంపాదించుకో గలుగుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చే సంపాదన వారి జీవనానికి ఏ మాత్రం సరిపోవడం లేదు. పెరిగిన ధరలు చూసుకుంటే వచ్చే ఆదాయం సరిపోక బోనులోపడ్డ ఎలుకలా గిలగిలలాడుతున్నాడు.. ఈ ద్రవ్యోల్బణం పేద, మధ్యతరగతి జీవులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలికింద నల్లిలా నలిపేస్తుంది.

 

 

ఇక సామాన్యులకు ధరల పెరుగుదల శరాఘాతంగా మారింది. జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప సంచులు నిండటం లేదనే ఆవేదన ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పెరుగుదల వల్ల నెలకు 20 నుంచి 30 శాతం దాకా వ్యయం పెరుగుతోంది. వినియోగదారు ధరల సూచి ఆధారంగా నవంబరులో ద్రవ్యోల్బణం రేటు జాతీయ సగటు కంటే తెలంగాణలో అధికంగా ఉంది. దేశంలో నవంబరులో గత మూడేళ్లలో ఎప్పుడూ లేనంతగా ద్రవ్యోల్బణం 5.54 శాతానికి పెరిగింది.

 

 

ఇదే సమయంలో తెలంగాణలో అదే నెలలో ద్రవ్యోల్బణం 5.94 శాతానికి ఎగసింది. ఆహారోత్పత్తులు, నిత్యావసరాలు కొనాలంటే ప్రజల ఖర్చు ఏకంగా 20 నుంచి 30 శాతం పెరిగినట్లు ధరల లెక్కలే వివరిస్తున్నాయి. ఇకపోతే ఏడాది వ్యవధిలో పలు ఆహారోత్పత్తుల ధరలు 10 నుంచి 30 శాతం వరకూ పెరిగాయని చిల్లర వ్యాపారులే చెపుతున్నారు. పౌరసరఫరాల శాఖ నివేదిక ప్రకారం అత్యధికంగా ఉల్లిగడ్డలు సుమారు 300 శాతం.. పప్పుల్లో మినప్పప్పు ధర 34 శాతం పెరిగాయి.

 

 

ఇదీ గాకుండా ఇప్పుడున్న సీజన్‌లో సాధారణంగా కూరగాయల ధరలు అందుబాటులో ఉండాలి. కానీ తాజా పరిస్థితిని చూస్తే. వీటి ధరల్లో అత్యధికం ప్రజలను బెదరగొట్టే స్థాయిలో పెరిగాయి. మునగకాయలు, ఉల్లిగడ్డలు కొనాలంటే గుండెలు అదురుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, దూరప్రాంతాల నుంచి కూరగాయలు వస్తున్నందున రవాణా ఛార్జీలతో కలిపి ధరలు మండుతున్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాగైతే సామాన్యుడు బ్రతికేది ఎలా తన మనుగడ సాగించేది ఎలా అని వాపోని మద్యతరగతి ప్రాణిలేదు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: