హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు..!

Reddy P Rajasekhar
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఈరోజు లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. బాలకృష్ణ హిందూపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరు కావటానికి హిందూపురం కు బయలుదేరగా కారులో ప్రయాణిస్తున్న నందమూరి బాలకృష్ణను కోడికొండ చెక్ పోస్టు నుండి హిందూపురం వచ్చే రహదారిలో గ్రామస్థులు అడ్డుకున్నారు. 
 
విద్యార్థులు, గ్రామస్థులు లేపాక్షి - హిందూపురం మెయిన్ రోడ్డు నుండి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకు భూమి పూజ చేసి సంవత్సరం అయినప్పటికీ పనులు ఇంకా పూర్తి కాలేదని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ గ్రామస్థులకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాలకృష్ణ హామీ ఇవ్వటంతో గ్రామస్థులు వెనక్కు తగ్గారు. 
 
హైదరాబాద్ నుండి బెంగళూరుకు విమానంలో చేరుకున్న బాలకృష్ణ బెంగళూరు నుండి రోడ్డు మార్గం ద్వారా కారులో హిందూపురం చేరుకున్నారు. 2014, 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల సమయంలో రాయలసీమ అంతటా వైసీపీ పార్టీ హవా ఉన్నప్పటికీ  బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 
 
ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. డిసెంబర్ నెలలో లేదా సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ నుండి గ్యాంగ్ స్టర్ గా మారతాడని తెలుస్తోంది. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా సి కల్యాణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణకు జోడీగా సోనల్ చౌహాన్ ఈ సినిమాలో నటిస్తోంది. 
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: