కర్ణాటక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కలకలం

NAGARJUNA NAKKA
కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ కేసు కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తామని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. గతంలో సీఎల్పీ నేత కూడా సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారని ఆయన గుర్తుచేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్యాపింగ్ వ్యవహారం కుమారస్వామి మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


రాజకీయపరమైన కక్ష సాధింపులు ఉండవని అంటూనే.. కర్ణాటకలో అధికార పార్టీ భిన్నంగా ప్రవర్తిస్తోంది. మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత  హెచ్ డీ కుమారస్వామిపై వచ్చిన ట్యాపింగ్ ఆరోపణలపై..  దర్యాప్తును సీబీఐకి అప్పగించినట్లు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. ఈ కేసు వ్యవహారం తమ పరిధిలో లేదని ఆయన స్పష్టంచేశారు. 


కాంగ్రెస్-జనతాదళ్ సంకీర్ణ కూటమి ప్రభుత్వ హయాంలో తొలిసారిగా ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ కమల తరుణంలో ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీకి చెందిన కొందరు కీలక నేతలు, సీనియర్ ఐపీఎస్ అధికారుల ఫోన్లను అప్పటి కుమారస్వామి ప్రభుత్వం ట్యాప్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ వ్యవహారం తెర వెనుకే ఉండిపోయింది. వాటికి బలం కలిగిస్తూ.. కుమారస్వామి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ తిరుగుబాటు ఎమ్మెల్యే విశ్వనాథ్ తాజాగా ప్రకటించారు. ఆయన చేసిన ఆరోపణను అడ్డుగా పెట్టుకుని బీజేపీ ఈ కేసును తిరగదోడుతోంది. ఫోన్ ట్యాపరింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే కాదు.. స్వయంగా ఆ పార్టీ శాసనసభా పక్ష నేత సైతం డిమాండ్ చేయడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో డిమాండ్ చేయించాలంటూ కాంగ్రెస్ సభా పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే పట్టుబట్టారు. బీజేపీ నాయకులతో వారు గళం కలపడం జేడీఎస్ కు సమస్యలను తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీజేపీకి తోడు కావడంతో కుమారస్వామి ఒంటరివారయ్యారని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం తనకు తెలియదని, ఈ తతంగం ఎప్పుడూ తన దృష్టికి రాలేదని సిద్ధరామయ్య చెప్పడం.. అనేక అనుమానాలకు తెర తీసింది. ఫోన్ ట్యాప్ ఎవరు చేసినా తప్పేనని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేయడం పట్ల కుమారస్వామి ఇరకాటంలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతుగా ఉంటుందని ఆయన ఆశించినప్పటికీ.. దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొనడం ఆయనను ఆందోళనకు గురి చేస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: