వైసీపీకి తిరుగులేని షాక్ ఇవ్వబోతున్న తెలుగుదేశం!

Vasishta

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తిరుగులేని పార్టీగా అవతరించేందుకు సైకిల్ పార్టీ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి విజయం సాధించిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకుంటున్న పసుపు నేతలు.. జిల్లాకు చెందిన మరో కీలక నేతను కూడా సైకిల్ ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..


ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను, రాజకీయ నేతలను తమ పార్టీలో చేర్చుకున్న తెలుగుదేశం పార్టీనేతలు మరో కీలక నేత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని తిరుగులేని పార్టీగా ఉన్న వైసీపీకి తెలుగుదేశం తిరుగులేని షాక్ ఇచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని తమ పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం జిల్లాలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంది. తాజాగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా పార్టీలో చేరడంతో సైకిల్ పార్టీ జోరు పెరిగింది..


రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన నంద్యాల ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కలిగిన కోట్ల కుటుంబంపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. రాయలసీమలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కుదేలవడంతో ఆ పార్టీలో బలంగా ఉన్న నాయకులకు ఇప్పటికే ఇతర పార్టీలకు క్యూ కట్టారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో తిరుగులేని నాయకుడిగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని టిడిపి లో చేర్చుకుంటే రాజకీయంగా పార్టీకి లాభం జరుగుతుందన్న ఆలోచనతో టీడీపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది..


మూడుసార్లు ఎం.పి.గా పనిచేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కూడా పని చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. అటు కోట్ల సతీమణి సుజాతమ్మ కూడా డోన్ నియోజక వర్గ ఎమ్మెల్యే గా పనిచేశారు. జిల్లాలో గట్టిపట్టున్న కోట్ల కుటుంబం బరిలోకి దిగితే రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే కోట్ల మాత్రం పార్టీ మారే అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. తమ అభిమానులు, కార్యకర్తల నిర్ణయం మరకు భవిష్యత్తు ప్రణాళిక ఉంటుందని అంటున్నారు.. రాబోయే ఎన్నికల్లో కోట్ల కుటుంబం ఎటు వైపు పయనిస్తుందనేది ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: