టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ హత్యకేసులో కొత్త ట్విస్ట్..!

Edari Rama Krishna
వరంగల్ లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళీ మనోహర్‌ (45) దారుణ హత్య గురైన విషయం పెను సంచలనాలకు తెరలేపింది. తాజాగా అనిశెట్టి మురళీ మనోహర్‌  హత్య కేసు దర్యాప్తు అనూహ్య మలుపు తిరిగింది. మురళి హత్య కేసులో పలువురు కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నట్లు తాజాగా పోలీసులు వెల్లడించడం గమనార్హం. ఈ హత్య కేసులో ఏ4 నిందితుడిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, ఏ5గా పోతుల శ్రీమాన్, ఏ6 కానుగంటి శేఖర్ పేర్లను పోలీసులు చేర్చారు.    

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఈ ముగ్గురు కాంగ్రెస్‌ నేతల పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.  దారుణమైన విషయం ఏంటంటే..మురళి హత్య ఆయన పుట్టిన రోజునే చేయాలని పక్కా ప్లాన్ తో దుండగులు ఆయన  సొంత ఇంట్లోనే  అత్యంత పాశవికంగా నరికి చంపారు. హత్య చేసిన అనంతరం నిందితులు తాము హత్యకు ఉపయోగించిన ఆయుధాలను దారిపొడవునా గాల్లో తిప్పుతూ బైకులపై హన్మకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

 అయితే తమను రాజకీయంగా చాలా కాలం నుంచి ఇబ్బందులకు గురి చేయడమే హత్యకు ప్రధాన కారణం అని నేరస్తులు ఒప్పుకున్నారు.  కాగా, రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టేందుకే తమ పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారని కాంగ్రెస్ నేతలు నాయిని రాజేందర్ రెడ్డి, శ్రీమాన్, శేఖర్ అన్నారు.  తమపై వచ్చిన నేరారోపణ అవాస్తవమని అసలు విషయాలు తెలియకుండా కేసు నమోదు చేయడం సమంజసం కాదని వారు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: