మెరీనా బీచ్ వద్ద స్టాలిన్ దీక్ష..హైటెన్షన్‌..!

Edari Rama Krishna
తమిళనాడులో మొన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పళని స్వామి, నేడు అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకోవాల్సి ఉండగా ఉదయం అసెంబ్లీలో ఆయన వెంట 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పీకర్ కి తెలిపారు.  మరోవైపు రహస్య ఓటింగ్ జరిపించాలని పట్టుబట్టారు డీఎంకే అధినేత స్టాలిన్, పన్నీరు సెల్వం.  ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది..స్పీకర్ ని చుట్టుముట్టిన డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ ని విరిచి, కాగితాలు వెదజల్లి అరాచకం సృష్టించారు.  దీంతో రెండు సార్లు వాయిదా వేసిన స్పీకర్ గొడవ చేస్తున్న ఎమ్మెల్యేలను మార్షల్స్ చే బయటకు పంపించారు.  

తమను బలవంతంగా సభ నుంచి మార్షల్స్‌తో గెంటివేయించడంతో ఆగ్రహంగా ఉన్న స్టాలిన్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఆయన వెంట డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీ కనిమొళి కూడా ఉన్నారు. బలపరీక్ష జరిగిన తీరు, స్పీకర్‌ ధనపాల్‌ వ్యవహార సరళిపై గవర్నర్‌కు స్టాలిన్‌ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే డీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి మెరీనా బీచ్‌కు బయలుదేరిన ఆయన.. చినిగిన చొక్కాతోనే అక్కడ ఉన్న గాంధీ విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నారు.  

డీఎంకే పార్టీ పట్ల స్పీకర్ తీరును నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు చెన్నై సహా పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలకు దిగారు. ఆర్నీ, అంబూర్, వనియంబడి, రాజీపేట్, అరక్కోణం తదితర ప్రాంతాల్లో స్పీకర్ ధన్‌పాల్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళనలు చేపట్టారు. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించడంతో మెరినా బీచ్‌ వద్ద హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: