ఎడిటోరియ‌ల్‌: మ‌రో మేరినా కానున్న విశాఖ బీచ్‌!?

DSP
జనవరి 26... ప్రస్తుతం అందరి దృష్టి ఆ రోజు మీదే ఉంది. కారణం... ఆ రోజు ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖ లోని ఆర్కే బీచ్ లో ఆందోళనకు రంగం సిద్ధమవుతోంది. హోదా కోసం ఏపీ యువత ఏకమవుతోంది. పార్టీలకు అతీతంగా శాంతియుతంగా చేపట్టే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత హాజరుకావాలంటూ... గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ నిరసనకు జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు పలకడంతో, పోలీసులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ కార్యక్రమానికి  పవన్ హాజరవుతు న్నారు.


మరోవైపు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజు విశాఖలో ఉండనున్నారు. మరుసటి రోజు నుంచే ప్రతిష్టాత్మక సీఐఐ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో, ప్రత్యేక హోదా నిరసన కార్యక్ర మానికి అనుమతి ఇవ్వడం పోలీసులకు కత్తి మీద సామే. అయితే, నిరసన కార్యక్రమం అనుమతి కోసం ఇంత వరకు తమను ఎవరూ సంప్రదించలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఓవైపు నిరసన కార్యక్రమం జరుగుతుంటే... అక్కడే  ఉన్న ముఖ్యమంత్రికి ఇది ఇబ్బందికర అంశమేనని విశ్లేషకులు భావిస్తు న్నారు

మ‌రోవైపు,  ఈనెల 26న సాయంత్రం విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో శాంతియుత నిరసన కార్యక్రమానికి ఎవరు పిలుపునిచ్చారో తమకు తెలియదని జిల్లా కలెక్టర్‌ సీపీ లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. అందువల్ల తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు తమ పిల్లలను ఆందోళన కార్య క్రమానికి పంపవద్దని సూచించారు. అంతేకాకుండా ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మక పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌ ఉన్నందున ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు అనుమతివ్వడం లేదని వారు తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికిప్పుడు అనుమతి కోసం దరఖాస్తు చేసినా ఇంత తక్కువ సమయంలో అనుమతి ఇవ్వలేమని చెప్పారు. 

ఇక   ప్రత్యేక హోదా కోసం యువత మౌన ప్రదర్శన చేస్తే, జనసేన మద్దతు ఇస్తుందని పవర్ స్టార్ పవన్ కళ్యా ణ్ ప్రకటించారు. చెన్నయ్ లో మెరీనా బీచ్ వేదిక కనుక, విశాఖ బీచ్ ను ఎంచుకున్నారు. సరే, పవన్ పిలుపు ఇచ్చినా, బాబు చూసీ చూడనట్లు ఊరుకునేవారేమో? కానీ ప్రతిపక్ష నేత జగన్ తిన్నగా వుంటారా? తాము కూడా ఈ హోదా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామన్నారు. పైగా అడిషనల్ ప్రోగ్రామ్ ఒకటి ప్రకటించారు. విశా ఖ బీచ్ లో కొవ్వొత్తుల ప్రదర్శన ఒకటి ప్రకటించారు. మామూలుగా అయితే దీనికి టాట్..వీల్లేదు అని అనివుండే వారే మో? కానీ దీనికి ముందుగా జన సేన కార్యక్రమం వుందిగా? వద్దంటే రెండూ వద్దనాలి. 

అది సాధ్యం కాదు. ఇదో తలకాయనొప్పి. మరోపక్క జనసేన అంటే మన అస్మదీయుల పార్టీ కదా? ఆ కార్యక్ర మం కూడా మనదే అని తెలుగుదేశం సామాన్య కార్యకర్తలు ఎక్కడ అనుకుంటారో? అందుకే ఇలా పవన్ ట్వీట్ లు రావడం భయం, చంద్రబాబు అలా బుస్సుమన్నారు. అది కూడా ఎలా? తనకు అలవాటైన రెండు కళ్ల సిద్దాంతం మాదిరిగానే. తను తిడుతున్నది, టార్గెట్ చేస్తున్నది తొలుత కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన పవన్ కళ్యాణ్ నా? లేక దాంట్లో తాము కూడా పార్ట్ అవుతామంటున్న వైఎస్ జగన్ నా? అన్నది క్లారిటీ లేకుండా విమర్శలు సాగించారు. ఇంట్లొ కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అని ఓ మాట విసిరారు. ఇదిమాత్రం కచ్చితంగా పవన్ కు తగలాల్సిందే. 

ఎందుకంటే జగన్ ఇంట్లో  కూర్చుని కబుర్లు చెప్పడంలేదుగా?అందరి కన్నా ముందు నుంచే హోదా మీద ఆయన స్వయంగా పోరుబాటలో దిగారు. పైగా నిత్యం ఏదో ఒక వ్యవహారం తలకెత్తుకుని జనంలోనే వుంటు న్నారు. పవన్ సంగతి తెలిసిందే. రెండు మూడు నెలలకు ఓసారి జస్ట్ అలా బయటకు వచ్చి, ఇలా మాయం అవుతారు. ట్వీట్ లు మాత్రం మీటుతుంటారు. సో, పవన్ ను విమర్శించినట్లు అనిపించడం ద్వారా, తెలుగు దేశం నాయకులకు ఓ పాయింట్ అందించారు చంద్రబాబు. ఇక ఒక వేళ పవన్ ను టార్గెట్ చేయాల్సిన  పరిస్థితి వస్తే, ఈ పాయింట్ ను వాడుకుంటారు వాళ్లు.

ఇక పనిలో పనిగా చంద్రబాబు కేంద్రానికి ముందే సంజాయషీ ఇచ్చేసారు. తను కేంద్రంతో గొడవ పడనని, ప్యాకే జీ బాగున్నందునే ఓకె అన్నానని, తను ఇంక హోదాపై పోరు చేసేది లేనట్లుగా పరోక్షంగానే చెప్పేసారు. అంటే ఇక తెలుగుదేశం వైపు నుంచి విశాఖ ఉద్యమానికి మద్దతువుండదు. కానీ అలా అని పూర్తిగా ధీమా పడడానికి లేదు. బాబు వద్దన్నా,హోదా మీద నమ్మకం వున్న యువత బీచ్ దారి పట్టినా పట్టొచ్చు. అందువల్ల ఇది నిజంగా ఓ పెద్ద తలకాయనొప్పే బాబుకి. మొత్తంమీద మ‌ద్రాస్ మెరినా బీచ్ త‌ర‌హాలో విశాఖ బీచ్ లో ఉద్య‌మం త‌ప్ప‌ద‌న్న‌మాట...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: