అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం

Prasad Bura
జల్లికట్టుపై ఆర్డినెస్స్ జారీ చేసినా.. నిరసనలు ఆగకపోవడంతో.. పన్నీరు సెల్వం ప్రభుత్వం ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఉద్యమానికి వేదికైన మెరినా బీచ్ నుండి ఆందోళనకారులను తరిమేసే ప్రయత్నం చేస్తోంది. భారీగా పోలీసు బలగాలను మోహరించి.. అక్కడున్న వారిని చెదరగొడుతోంది. దీంతో నిన్నటిదాకా నినాదాలతో హోరెత్తిన చెన్నై మెరీనా బీచ్‌లో ఇప్పుడు బెదిరింపుల కేకలు వినిపిస్తున్నాయి. 

ఈ తెల్లవారుజామునుంచే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు మెరీనా బీచ్ ను ఖాళీ చేయించే పని మొదలు పెట్టారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు తమను అడ్డుకుంటే సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. మూకుమ్మడిగా జాతీయగీతాన్ని ఆలపిస్తూ పోలీసులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినాసరే పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఒకవైపు బీచ్‌ను ఖాళీ చేయిస్తూనే, అటు వైపునకు వచ్చే దారులన్నింటినీ దిగ్బందించారు.

తమకు చట్టమంటే గౌరవమని, మధ్యాహ్నం వరకు నిరసనలకు సమయమివ్వాలని ఆందోళనకారులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తరువాత స్వచ్ఛందంగా తమ ఆందోళన విరమిస్తామని వేడుకున్నారు. అందుకు అంగీకరించని పోలీసులు.. మీరు అనుకున్నది నెరవేరింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ వచ్చింది. గిత్తల పోటీలు కూడా ప్రారంభమయ్యాయి.. ఇక ఆందోళన విరమించాల్సిందేనని హుకుంజారీ చేశారు. అప్పటికీ వెనక్కి తగ్గని నిరసనకారుల్లో కొందరు సముద్రంవైపునకు పరుగెత్తే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకుని, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

తామనుకున్నది లభించేదాకా బీచ్‌నుంచి కదిలేదిలేదని బైఠాచించిన నిరసనకారులకు స్థానిక మత్స్యకారులు కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చెన్నై మెరీనా బీచ్ లో పోలీసుల తీరును నిరసిస్తూ మధురైలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: