జనాల్ని తాగుబోతుల్ని చేసి బంగారు తెలంగాణా సాదించటం సాధ్యమా?

 

హైదరాబాద్ మహానగరములో ప్రతి కిలోమీటర్ కు మెడికల్ షాప్ ఉండదేమో గాని, వైన్-షాప్ గాని, కల్లు కాంపౌండ్ గాని తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి మందుషాపు క్రిక్కిరిసిన జనాలతో కళకళలాడుతూ జీవిత మంటే మందే, వినోద మంటే మందే, పండగన్న పబ్బమన్నా మందే లాగా అయిపోయింది మన తెలంగాణా. పసిబాలుర నుండి పండు ముదుసళ్ళ వరకు మందు లో, మత్తులో మునిగి తేలటం మనకు ఆనవాయితీ అయింది.




వేళ పాళ లేకుండా, రాత్రి పగ లుతెడా లేకుండా కడుపులో లీటర్ల కొద్దీ పోసేసి, మైకం తలకెక్కి మత్తులో తూలి రోడ్దు పై తూలి పడిపోయే జనాల సంఖ్య రోడ్ల పై జి.హెచ్.ఎం.సి. వాళ్ళ నోళ్ళు తెరుచుకున్న మాన్ హోల్స్ కన్నా ఎక్కువే ఉంటాయి. కనీసం మన వీదుల్లో, సందుల్లో, కాలనీలలో ఉన్న స్పీడ్ బ్రేకర్ల సంఖ్యకు దగ్గరగా నైనా ఉంటాయి. ఇక్కడ రూలు ప్రకారం మైనర్లకు మందు వైన్ షాపుల వాళ్ళు అమ్మకూడదు. కాని పసి బాలురు వెళ్ళి వాళ్ళ ఇంట్లోవాళ్ళకని (చెప్పినా చెప్పకపోయినా అడిగేవాడులేడు) చెప్పి బాటిళ్ళకు బాటిళ్ళు పట్టుకెళ్ళటం అతి సహజంగా కనిపించే సన్నివేశమే.


 కిటకిటలాడుతున్న పబ్లిక్ డ్రింకింగ్

 


మనకు వైను షాప్ దగ్గరలోనే ఉందని రోడ్   పై  వందల్లో  అడ్డదిడ్డంగా పార్క్ చేసి ఉండే టూవీలర్లే దొడ్డు గుర్తు. తిరణాళ్ళా, జాతరల్లా వైన్ షాప్ ముందు నుండి నడిరోడ్ పై వరకు జనం మూగి ఉంటారు. తాగటం, తాగి ఊగటం, ఊగుతూ తాగటం ఇలాంటి అనేక పద్దతుల్లో తాగి పడిపోయే జనాల మధ్య వాహనాలను, అది కారైనా, బైక్ అయినా చివరకు సైకిలైనా నడపటం ప్రళయాంతకం.తెలంగాణా మందు శాఖ అదేనండి ఎక్సైజు శాఖ ప్రాంతాల, జిల్లాల, నగరాల, పట్టణాల, గ్రామాల, చివరకు వీధుల వారీ పోటీ పెట్టి మందు అమ్మకాలని ప్రమోట్ చేస్తూ దినదిన ప్రవర్ధమానంగా వినియోగదారులను పెంచుకుంటూ ముందుకు సాగుతుంది.


ప్రాణాంతమైన కలయిక డ్రింక్ & డ్రైవ్ & ఈగో




ప్రభుత్వం సిగ్గులేకుండా దేవాలయాలు, విద్యాలయాలు ఉన్నచోట కూడా పర్మిట్స్ ఇస్తూ, పెర్మిట్ రూములకూ అవకాశం ఇస్తూ దాదాపు అర్ధరాత్రి వరకు మందుకు లోటులేకుండా చూస్తూ ప్రజాసేవ చేస్టుంది. ఇక మన నాయకులు ఉపన్యాసాలిచ్చేటప్పుడు మాట్లాడితే బంగారు తెలంగాణా అంటూ ఉంటే, ప్రతి తాగుబోతూ అవును మనది బంగారు తెలంగాణాయే భయ్యా అంటూ ఎంజాయ్ చేస్తూ మైకంలో కాలం గడిపేస్తూ తల ఊపేస్తుంటారు. తాగుడూ ఊగుడులో మన యువత అదీ మైనర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. డ్రంక్ ఎన్ డ్రైవ్ లో వందలకొద్దీ మైనర్లు దొరుకుతున్నారని పోలీసులు పేపర్లలో ఊదరగొడుతున్నారు. కార్ ప్రమాదాలు చేసి మనుషులపైనే వాహనాలని నడిపే సాంప్రదాయం బలపడుతుంది.




ఇక బంజారా, జూబిలీ ప్రాంతాల్లో పెద్దలు (రాజకీయ నాయకులు వెనక ఆసరమైతే సిగ్గులేకుండా ముందుండి) నడిపే హుక్కా సెంటర్లలో మైనర్ల హవా కూడా చాలా యెక్కువే. డ్రంక్ ఎన్ డ్రైవ్ లో మాదక ద్రవ్యాలు వాడే వాళ్ళూ విపరీతంగా దొరుకుతున్నారు. ఇందులో సెలెబ్రిటీలు సంఖ్య తక్కువేమీ కాదు. ఈ మద్య మహిళామణులు కూడా పురుషపుంగవుల కంటే మేమెందులోనూ, ముఖ్యంగా మందు సేవనం లో తక్కువకాదని, మందుకొట్టి అర్ధరాత్రి అపస్మారకంగా ఏ స్థితిలో ఉన్నారో, వంటిపై బట్టలున్నయో లేవో అని కూడా సోయిలేని పరిస్థితుల్లో రాజధాని రాజమార్గాల్లో సైతం పోలీసులను కలవర పెడుతూ హల్-చల్ చేయటం సర్వసాధారణం అయిపోయింది. పోలీసులూ తాగి తూలూతూ వారి వాచాలత ప్రదర్శించటం అవసరమైతే అమాయకులపై లాఠీ ఝుళిపించటం కూడా మనకు కొత్తకాదు.


డ్రంక్ ఎన్ డ్రైవ్ లో పట్టుబడ్డ లేడీ డాక్టర్ 




ఈ తాగుబోతులవల్ల జరిగే ప్రమాదాల సంఖ్య లెక్కబెట్టలేనంత. యువత హెరాయిన్ లాంటి మత్తుమందు ఇచ్చే కిక్కులో మునిగి తేలుతున్నారు. గౌరవ రాష్ట్రపతి గారు తమ ఉపన్యాసములో మనదేశ జనాభాలో ఉన్నంత యువజన సంపద మరేదేశానికి లేదని సంబరపడ్డారు. కాని మనయువత మత్తులో తూగుతుందని ఆయనగారు ఊహించి ఉండరా!  అందుకే మన తెలంగాణా ప్రభుత్వం తన పద్దతి మార్చుకోక పోతే బంగారు తెలంగాణా కావటం అటుంచి మందు, మత్తు, మైకం, కైపుతో తూలిపడే  తెలంగాణా కావటం ఖాయం.


రమ్యను కుటుంబాన్ని బలితీసుకున్న మైనర్ తాగుబోతులు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: