ఈ షాపింగ్‌ మాల్‌లో.. పొరపాటున కూడా రీల్స్ ట్రై చేశారో ఇక అంతే సంగతి?

praveen
ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా రీల్స్‌ గొడవే నడుస్తోంది. ఖాళీ రోడ్డు, ట్రాఫిక్ రోడ్డు, ఇల్లు, వాకిలి, ఆఫీసు, డైనింగ్ రూమ్, సినిమా హల్, షాపింగ్ మాల్, సముద్రం, ఎడారి, సరస్సులు.... ఇలా ఎక్కడ పడితే
కాదేది కవితకు అనర్హం అన్నట్టు... కుర్రకారు రెచ్చిపోయి మరీ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటే చూపరులమైన మనం ఎంజాయ్ చేస్తూ వున్నాం. ఇదే క్రమంలో పట్టణాల్లో నివసిస్తున్న యువత ముఖ్యంగా షాపింగ్ మాల్లో ఎక్కువగా రీల్స్ చేయడం మనం గమనించవచ్చు. వారు అక్కడికి వెళ్లి కొనేది, తినేది ఏమి ఉండదు. అలా ప్రఖ్యాత రెస్టారెంట్‌లు, మాల్స్‌లో అడుగుపెట్టి అనవసర డిస్టబెన్స్ చేస్తూ వుంటారు. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి ఓ మాల్ ఫైన్ రూపంలో ప్రవేశ రుసుము చెల్లించమంటోంది.
అవును, ఇంతకీ ఇది ఎక్కడంటే? స్పెయిన్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌ 5 యూరోల ప్రవేశ రుసుం బోర్డు పెట్టగా ఆ తంతు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్పెయిన్‌ దేశం బార్సిలోనాలోని ఓ ప్రముఖ షాపింగ్‌ మాల్‌ "కువియూస్‌ ముర్రియా" అనే మాల్ వుంది. 1898 నుంచే ఇక్కడ వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. శతాబ్దానికి పూర్వమే నిర్మించిన ఈ మాల్‌లో వింటేజ్‌ లుక్ చూపరులను కట్టి పడేస్తుంది. ఇందులోని వస్తువులన్నీ స్పెయిన్‌ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అందుకే పర్యాటకులతో ఎల్లవేళలా కిక్కిరిసిపోతూ ఉంటుంది. ఈ మాల్‌లో కొన్ని ప్రత్యేకమైన సాస్‌లు, చీజ్‌, మాంసం, నూనెలు దొరుకుతాయి. కానీ, వాటిని కొనకుండానే పర్యాటకులు వెళ్లిపోతుంటారు.
ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్స్‌ రీల్స్‌ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దాంతో వచ్చిన ప్రతి ఒక్కరూ వీడియోలు తీసుకొని బయటకు వెళ్లిపోతున్నారు తప్ప కొనడానికి మాత్రం ముందుకు రావడంలేదు. అలాంటి వారికి చెక్‌ పెట్టాలని భావించిన యాజమాన్యం ప్రవేశ రుసుం పేరుతో బోర్డు పెట్టేసింది. ఏ వస్తువు కొనకుండా వెనుదిరిగితే 5 యూరోలు చెల్లించాలని ప్రవేశ ద్వారం వద్దే హెచ్చరిక ఏర్పాటు చేయడంతో చాలామంది రీల్స్  చేయకుండానే వెనుదిరుగుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదు.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పర్యాటకులు ఈ మాల్‌లోకి అడుగుపెడుతున్నారు. కొందరైతే కిటికీల్లో నుంచే తమకు కావాల్సిన ఫుటేజీ తీసుకొని అక్కడ్నుంచి నిష్క్రమిస్తున్నారు. ఐడియా బావుంది కదూ. మీరు కూడా వ్యాపారులైతే ఒక్కసారి దీనిగురించి ఆలోచించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: