యూఎస్‌కు వెళ్తున్న విద్యార్థుల్లో తెలుగోళ్లే ఎక్కువ..?

Suma Kallamadi
అగ్రరాజ్యం అమెరికాలో అత్యున్నత చదువులు చదివేందుకు ఆసక్తి చూపుతున్న భారతీయులలో ఎక్కువగా తెలుగు వారే ఉండటం గమనార్హం. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది విద్యార్థులు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలలో చదువుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచే చాలా ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు. ఆగస్టు 27న నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ వర్చువల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ లో కూడా తెలుగు విద్యార్థులే అధికంగా పాల్గొన్నారు. ఎడ్యుకేషనల్ కల్చరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ లో ఇండియా నుంచి ఆరు వేల మంది పాల్గొన్నారు.
అయితే వారిలో 1,962 మంది స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. అంటే దాదాపు 32 శాతం మంది విద్యార్థులు ఈ మూడు రాష్ట్రాల నుంచే పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. వేలాది మంది తెలుగు విద్యార్థులు అమెరికా దేశంలో ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకుంటున్నారు. అయితే అలాంటి విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు ఎడ్యుకేషనల్ కల్చరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించింది. ఈ ఫెయిర్‌లో మన తెలుగు వారే ఎక్కువ మంది ఉండటం విశేషమని అధికారులు చెబుతున్నారు.
2020 తో పోలిస్తే ఈ ఏడాది 44 శాతం అధికంగా తెలుగు విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో హైదరాబాద్‌ నుంచే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్నారని అమెరికా కాన్సులేట్‌ జనరల్ అధికారి‌ జోయల్‌ రీఫ్‌మన్‌ వెల్లడించారు. ఈ ఎడ్యుకేషన్‌ కార్యక్రమంలో 101 అమెరికన్ విద్యాసంస్థలు పాటిస్పేట్ చేశాయి. ఫ్లోరిడా ఇంటర్నేషనల్‌, కొలరాడో స్టేట్‌, పిట్స్‌బర్గ్‌ లాంటి పలు ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థలు సైతం ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో పాల్గొన్నాయి.
అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు అమెరికన్ యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులతో మాట్లాడి తమ సందేహాలను తీర్చుకున్నారు. ఈ క్రమంలోనే స్టూడెంట్‌ వీసా ప్రొసీజర్ కి సంబంధించిన అన్ని వివరాలను అమెరికా దౌత్య కార్యాలయం అధికారులు విద్యార్థులకు వివరంగా తెలిపారు. ఇదిలా ఉండగా మళ్ళీ సెప్టెంబర్‌ 3వ తేదీన ఇంకొక ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను నిర్వహించనున్నారట. మరి రేపటి ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లో ఎంత మంది తెలుగు విద్యార్థులు పాల్గొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: