ఇండియాలో వ్యాపారం చేయడం సవాళ్లతో కూడుకున్నది: అమెరికా

Suma Kallamadi
కరోనా సమయంలోనూ భారతదేశం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించిందని అగ్రరాజ్యం అమెరికా ప్రశంసలు కురిపించింది. కానీ భారతదేశంలో వ్యాపారం చేయడం చాలా సవాళ్లతో కూడుకున్నదని వ్యాఖ్యానించింది. ‘2021 పెట్టుబడుల వాతావరణ నివేదిక’లో భారతదేశానికి సంబంధించి అనేక విషయాలను పేర్కొంది. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు భారత్ లో సానుకూల వాతావరణం లేదని అమెరికా విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. వ్యాపారస్థులను ఆకట్టుకునేందుకు నమ్మకమైన పెట్టుబడుల వాతావరణాన్ని నెలకొల్పడానికి ఇండియా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే అడ్డంకులను కూడా తొలగించాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం అభిప్రాయపడింది.


సుంకాలు పెంచడం, దిగుమతి నిబంధనలపై అశాస్త్రీయమైన రక్షణాత్మక చర్యలు చేపట్టడం వల్ల ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరూ కూడా ఆసక్తి కనబరచడం లేదని విదేశాంగ శాఖ పేర్కొంది. భారతదేశం ప్రత్యేకంగా పాటిస్తున్న ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవని.. దీనివల్ల అంతర్జాతీయ పంపిణీ వ్యవస్థల నుంచి ఏ ఉత్పత్తిదారుడు కూడా వ్యాపారాలు పెట్టేందుకు ధైర్యం చేయడం లేదని అగ్రరాజ్యం వెల్లడించింది. భారత్ పాటిస్తున్న ప్రమాణాలు వల్ల ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని అమెరికా వెల్లడించింది. ఇటువంటి కారణాల వల్ల ఇండియాలో బిజినెస్ చేయడం ఛాలెంజింగ్ గా మారిందని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.


కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలను మళ్లీ గాడిలో పెట్టేందుకు భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చిందని విదేశాంగ శాఖ పొగిడింది. 2021 జనవరి నాటికి జీడీపీ సానుకూల వృద్ధి చెందిందంటే.. దానికి కారణం ప్రభుత్వం తీసుకున్న చర్యలేనని అగ్రరాజ్యం వ్యాఖ్యానించింది. అయితే మరి అమెరికా సూచనల మేరకు భారత ప్రభుత్వం నమ్మకమైన పెట్టుబడుల వాతావరణాన్ని పెంపొందిస్తుంది లేదో చూడాలి. విదేశీ వ్యాపారస్తులు పెట్టుబడులు భారీగా పెట్టడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దీని వల్ల అన్ని విధాలా భారతదేశానికి లాభం చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: