కమలా హ్యారిస్ పై ఎన్నారైలు తీవ్ర అసహనం..?
ప్రముఖ అమెరికా దినపత్రిక "ది వాషింగ్టన్ పోస్ట్" ఒక ఇంటర్వ్యూ నిర్వహించి 20 మంది ఎన్నారైల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. వారిలో దాదాపు అందరూ కమలా తీరు పట్ల తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంఘం నాయకులు, రాజకీయ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, తదితరులు కమలా హ్యారిస్ భారతదేశంలోని కరోనా పరిస్థితులపై ఎలా స్పందిస్తున్నారనే విషయంపై మాట్లాడారు.
చికాగో యూనివర్సిటీలో బిజినెస్ స్టూడెంట్ గా ఉన్న 53 ఏళ్ల సుజాత షెనాయ్ మాట్లాడుతూ.. "కమలా హ్యారిస్ చాలా మందికి చాలా విషయాల్లో సహాయం చేసే హోదాలో నియమితులయ్యారు. మీరు ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్తే.. ఆ దేశ ప్రజలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో కచ్చితంగా గళం విప్పాలి" అని చెబుతూ అసహనానికి గురయ్యారు.
మరో విద్యార్థి, 22 ఏళ్ల అదితి ఖరోడ్ మాట్లాడుతూ, హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని అధిరోహించినప్పటికీ, కరోనా సంక్షోభ సమయంలో ఆమె సరిగా స్పందించలేదని.. ఆమె ప్రాతినిధ్యం లో నిజాయితీ లేదని స్పష్టమవుతోందని అన్నారు.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో సహాయ సహకారాలు అందించేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చాయి. ఇండో అమెరికన్లు కూడా భారత్ కి కరోనా పోరులో అండగా ఉండేందుకు సిద్ధమయ్యారు. కరోనా చికిత్సకు అవసరమైన వైద్య సామాగ్రిని ఉచితంగా అందించడం ప్రారంభించారు. కృష్ణమూర్తి, ప్రమీల జైపాల్, అమీ బేర వంటి ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా భారతదేశానికి సాయం అందించాలని బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
కానీ అమెరికా రాష్ట్ర విభాగం నిర్వహించిన ఒక ఆన్లైన్ ఈవెంట్ లో కమలా హ్యారిస్ భారత్ ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభంపై పైపరాకుగా స్పందించారు. దీంతో ఇండియన్ అమెరికన్లు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. అమెరికాకి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనా ధోరణి మార్చుకొని.. కరోనాతో సతమతమవుతున్న ఇండియాపై కమలా దృష్టి సారించాలని ఎన్నారైలు కోరుకుంటున్నారు. అయితే ఇంకొందరు కమలా కొనసాగుతున్న ఉపాధ్యక్షురాలు హోదాకి కొన్ని హద్దులు ఉంటాయని.. బైడెన్ ఎజెండా పరిధిలోనే కమలా స్పందించాల్సి ఉంటుందని.. ఆమెను విమర్శించడం సరైనది కాదని చెబుతున్నారు.