ఎన్నారై సాయానికి ఫిదా..?

Suma Kallamadi
హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ఎన్నారైలు భారతీయ ప్రజల కోసం తమ వంతు సహాయం చేస్తూనే ఉన్నారు. లక్షల డాలర్లలో విరాళాలు కలెక్ట్ చేస్తూ కరోనా చికిత్సకు సంబంధించిన వైద్య సామాగ్రిని భారతదేశానికి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తరుణ్ కప్పల అనే ఒక యువ ఎన్నారై అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అనంతరం తన కారును అంబులెన్స్ గా మార్చి కరోనా రోగులను ఉచితంగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అంతేకాదు రోగులకు ఆసుపత్రులలో పడకలు అందించే విషయంలో సహాయం చేస్తున్నారు. ఆక్సిజన్ బెడ్స్ దొరికేంతవరకు కరోనా రోగులకు ఉచితంగా కృత్రిమ ఆక్సిజన్ అందిస్తున్నారు.

ఒకరోజు తరుణ్ స్నేహితుడి యొక్క బంధువు కరోనా వైరస్ బారిన పడగా.. ఆ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ 34 వేల రూపాయలు తీసుకున్నాడట. ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాకైన తరుణ్.. పేదవాడి పరిస్థితి ఏంటని ఆలోచనలో పడిపోయారు. అప్పుడే తనకు తన కారుని అంబులెన్స్ గా మార్చాలనే ఆలోచన వచ్చింది. అయితే ఆయన తన కారును అంబులెన్స్ గా మార్చిన తర్వాత 24 మంది రోగులను ఆస్పత్రులకు తరలించారు. అలాగే రోగులు ఆసుపత్రిలో జాయిన్ అయ్యేంతవరకు వారికి సహాయం చేశారు. ఒకవేళ ఆస్పత్రిలో పడకల దొరకకపోతే మళ్లీ వేరొక ఆస్పత్రికి తీసుకు వెళ్లేవారు. ఈ విధంగా తరుణ్ తన కారులో ఎక్కిన ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారు.


తరుణ్ హైదరాబాద్ తిరిగి రాకముందు అమెరికాలో డెలాయిట్ కంపెనీలో కలిసి పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో స్ప్రింగ్‌ఎంఎల్‌లో టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేస్తున్నారు. అతని తల్లి బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకుంటున్నారు. తరుణ్ కోవిడ్ -19 రోగులను ఆస్పత్రికి తీసుకు వెళ్లే పనిలో నిమగ్నం కాగా అతని అక్క తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. కరోనా రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.8 వేల నుంచి రూ.35 వేలకు పైగా తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే తరుణ్ రోగులకు ఉచితంగా అంబులెన్స్ సేవలు అందిస్తుండటంతో నగర వాసులందరూ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: