గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం!
అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఇటు కరోనా లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అండగా నిలుస్తోంది. కరోనా లాక్ డౌన్ తో పనులు కోల్పోయి పస్తులున్న పేదలకు తాజాగా హైదరాబాద్‌లోని హప్సిగూడ, నాచారం, కాకతీయ నగర్ తార్నాక ప్రాంతాల్లో నివశిస్తున్న నిరుపేదలైన ఇంటి పని వాళ్లు, ఆటో కార్మికులు, వాచ్మెన్స్, చిన్న చిన్న వృత్తి పనులు చేసుకునే చేనేత కార్మికులు, మత్స్యకారులు, రజకులు, నాయి బ్రాహ్మణులు, పేదలు అయిన 500 నిరుపేద కుటుంబాలకు నాట్స్ చేయూతనిచ్చింది. వారికి కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేసింది. ఇక్కడ పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక పెద్దలు కొందరు నాట్స్ ఉపాధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన స్పందించి నిరుపేదలకు కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు కావాల్సిన సాయాన్ని అందించారు.
దీంతో స్థానిక పెద్దలు 500 కుటుంబాలకు ఆహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోతెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ళ ఆశయ్య, నానాపురం శివరాజ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆర్.వి.ఎస్ కార్యదర్శి జ్యోతి ఉపేందర్, జి నరేష్ పద్మ , నిర్మల, రేణుక సర్దార్ అశోక్ , శ్రీనివాస్ పరమేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కరోనా దెబ్బకు పనులు లేక.. పస్తులుండాల్సిన పరిస్థితుల్లో నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి అందించిన సాయం మరువలేనిదని నిరుపేదలు ఆనందం వ్యక్తం చేశారు.
ఎక్కడో అమెరికాలో ఉంటున్న ఇక్కడ తెలుగువారు కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించి సాయం చేసిన బాపయ్య చౌదరిని స్థానిక నాయకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని మరియు నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ నాట్స్ సంస్థ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎల్లపుడూ తెలుగు వారికి అండగా ఉంటుందని తెలిపారు.