అమెరికాలో ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన

frame అమెరికాలో ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన

Edari Rama Krishna
అమెరికాలో తెలుగు ఆడపడుచులు ముగ్గుల పోటీల్లో తమ కళాత్మకతను చూపెట్టారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో మే నెలలో డాలస్ వేదికగా జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాకంగా ముందుస్తుగా అనేక పోటీలను నాట్స్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ డాలస్ విభాగం చేపట్టిన ముగ్గుల పోటీలకు చక్కటి స్పందన లభించింది. చాలామంది మహిళలు తమలోని సృజనాత్మకతను ముగ్గులు వేసి చూపించారు. మానవ సేవే మాధవ సేవ అని నాట్స్ ఎప్పుడూ చెబుతూ  ఉంటుంది.-నాట్స్  నినాదం కూడా  ‘భాషే రమ్యం సేవే గమ్యం’ ఈ నినాదానికి దగ్గరగా ఉన్న సుందరమైన చిత్రాన్ని ముగ్గు రూపంలో అందించిన గాయత్రి ఆలూరుకు ఈ ముగ్గుల పోటీల్లో మొదటి స్థానం దక్కింది.

వృక్షోరక్షతి రక్షిత: .. చెట్లను పెంచి ప్రకృతిని కాపాడండి అనే భావనతో.. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రతిబింబిస్తూ వేసిన ముగ్గుకు  సంతోషి విశ్వనాధుల రెండవ స్థానం కైవసం చేసుకున్నారు. దృష్టి, రక్షణ, రాజసం, ఆధ్యాత్మికత అన్న నాలుగు సందేశాలు అందిస్తున్న భారత జాతీయ పక్షి నెమలిని అందంగా తమ ముగ్గులో వేసిన  శ్రీవాణి హనుమంతు మూడవ స్థానం దక్కించుకున్నారు. 

అమెరికా సంబరాలలో మహిళల జీవన సమతుల్యత కోసం వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నారీ సదస్సు సమన్వయ కర్త రాజేశ్వరి ఉదయగరి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు నారీ సదస్సు సభ్య బృందం రాధ బండారు, గాయత్రి గ్రిరి, లావణ్య ఇంగువ, వాణి ఐద, ప్రత్యూష మండువ, పద్మశ్రీ తోట సహకరించారు.  ముగ్గుల  పోటీలలో  పాల్గొన్న ప్రతీ మహిళా విజేత గా గుర్తిస్తున్నట్లు ఇరువురు న్యాయ నిర్ణేతలు జ్యోతి వనం, శ్రీలక్ష్మి మండిగ సంయుక్తంగా ప్రకటించారు. 

అమెరికా తెలుగు సంబరాలు మే 24 నుండి 26 వరకు  డాలస్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరం గా సాగుతున్నాయని ఆ విశేషాలను సంబరాల కమిటీ వివరించింది.  “మనమంతా తెలుగు -మనసంతా వెలుగు” ఇతివృత్తం ఆధారంగా మూడురోజుల పాటు కన్నులపండువగా జరగునున్నాయని తెలిపింది. శుక్రవారం ఆర్పీ పట్నాయక్, శనివారం మనో, ఆదివారం కీరవాణి..ఇలా వరుసగా మూడు పెద్ద సంగీత కచ్చేరీలు, శివారెడ్డి మిమిక్రీ, అందరినీ అలరించడానికి మిల్కీ బ్యూటీ తమన్నా, ఇంకా తెలుగు వారి  ఆనందం కోసం వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు, అందరినీ ఉత్తేజపరిచే డ్యాన్సులతో ఈ సంబరాలు అంబరాన్నంటేలా జరగనున్నాయని సంబరాల కమిటీ వివరించింది.

వీటితో పాటు నోరూరించే  రుచికరమైన తెలుగు వంటకాలు,  ఉత్తమ సాహితీ వేత్తలతో సాహితీ మకరందాలను పంచే కార్యక్రమాలకు వేదికలు  కూడా సిద్ధం చేస్తున్నట్టు కమిటీ పేర్కొంది. టిక్కట్ల కోసం www.sambaralu.org ను  సంప్రదించవచ్చని తెలిపింది. మే ఒకటో తేదీ లోపు టిక్కట్లు కొన్నవారికి ముప్పై శాతం డిస్కౌంట్ ఉన్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 

తెలుగు వారందరినీ ఒక వేదికపై కలిసి చిన్నారులకు, యువతకు మన సంస్కృతిని పరిచయం చెయ్యాలని, తెలుగువారి ఐక్యతకు కృషి చేయాలని, ఇలాంటి ముగ్గుల  పోటీలు  మన తెలుగు సంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి దోహదపడగలవని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ ఛైర్మన్  శ్రీనివాస్ గుత్తికొండ తమ సంయుక్త సందేశంలో పేర్కొన్నారు.

6వ అమెరికా సంబరాల కమిటీ కన్వీనర్ కిశోర్ కంచెర్ల, కమిటీ జాయింట్ కన్వీనర్  విజయ శేఖర్ అన్నె, వైస్ కన్వీనర్స్ ఆది గెల్లి, ప్రేమ్  కలిదిండి, రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ ఆదిభట్ల (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయవిక్రయ నిర్దేశకుడు), భాను లంక (ఆతిథ్యం నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల నిర్దేశకుడు), రామిరెడ్డి బండి (కార్యక్రమ నిర్దేశకుడు), చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) తదితరులు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు  అభినందనలు తెలియజేశారు... సంబరాల్లో తెలుగువారంతా పాలుపంచుకోవాలని కోరారు. 

స్పానర్స్ గా వ్యవహరించిన అవర్ కిడ్స్ మాంటిస్సొరి, వార్షిక స్పాన్సర్లుగా గా వ్యవహరించిన బావర్చి ఇండియన్ క్విజీన్, శేష గోరంట్ల-రియల్టర్, బిర్యానిస్ అండ్ మోర్, స్పార్కల్స్, తెరపీ ఫిట్, క్లౌడ్ మెల్లో, శరవణ భవన్, హాట్ బ్రెడ్స్ తో పాటు ఈ పోటీలకు సహకరించిన  ప్రసార మాధ్యమాలకు సంబరాల కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: