రివ్యూ: ఉపేంద్ర గాడి అడ్డాతో మెసేజ్‌..!

Chakravarthi Kalyan
క్లాస్‌ మూవీస్‌కి ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆదరణ ఉంటే ఇక మాస్‌ మూవీస్‌కి ప్రేక్షకుల్లో ముఖ్యంగా యూత్‌లో మంచి ఆదరణ ఉంటుంది. ఇక బిసి సెంటర్స్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్‌ మూవీస్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిపోతాయి. ఇక కొత్త హీరోలయినా సరే కథలో కంటెంట్‌ ఉంటే హీరోతో పని లేకుండా పోయింది నేటి సినీ ప్రేమికులకు. జోనర్‌తో సంబంధం లేకుండా కంటెంట్‌కి ఎక్కువ స్కోప్‌ ఉన్న మూవీ అయితే చాలు. తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా ఉపేంద్ర అనే కొత్త హీరో ఉపేంద్రగాడి అడ్డా చిత్రంతో పరిచయం అయ్యాడు. ఈ చిత్రం పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌. సావిత్రి కృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఎస్‌.కె.ఆర్యన్‌సుభాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించారు. ఈ చిత్రం నేడు విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది. మరి ఆ చిత్ర విశేషాలేంటో చూద్దాం...

కథ...ఉపేంద్ర హీరో ఈ చిత్రంలో ఓ బస్తీ కుర్రాడిగా కనిపిస్తాడు. డిగ్రీ పట్టా పట్టుకుని బాగా డబ్బు సంపాదించి స్థిరపడాలనుకునే పాత్ర. దానికోసం ఇక గతంలో మనం చూసిన కొన్ని చిత్రాలలాగానే ఓ ధనవంతురాలిని వివాహం చేసుకుని సెటిల్‌ అవ్వాలని అనుకుంటాడు. దాని కోసం అప్పులు చేసిఇష్టమొచ్చినట్లు విచ్చలవిడిగా జల్సా చేసేవాడు. ఇలాంటి సమయంలోనే హీరోయిన్‌ (సావిత్రి) పరిచయం అవుతుంది. తాను ఒక గొప్పింటి అమ్మాయి అనుకుని ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే అసలు విషయం ఆమెకు చెప్పాలని తాను ధనవంతుడిని కాదంటూ కేవలం అల్లరి చిల్లరిగా తిరిగే ఓ కుర్రాడిని అని చెబుతాడు. ఇంతకీ వారిద్దరి వివాహం జరిగిందా? వారి ప్రేమ ప్రయాణం ఎంత వరకు వచ్చింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి.

సినిమా యువతను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పొచ్చు. లవ్‌ అండ్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ కావడంతో బీసీ సెంటర్స్‌లో ప్రేక్షకులకు బాగా ఎక్కుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా చూడడంతో ఇటు యువతకి.. అటు తల్లిదండ్రులకి  మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం అని చెప్పవచ్చు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. అదే విధంగా వాటితో మంచి కంటే కూడా చెడు ఎక్కువగా జరుగుతుంది. అనర్ధాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ అంశాన్ని తీసుకుని దర్శకుడు కథని చూపించిన విధానం చాలా బావుంటుంది. ముఖ్యంగా ఈ చిత్రం యువత ఎలా చెడిపోతున్నారు. ఆన్‌లైన్‌లో ఎలా మోసపోతున్నారు. దీంతో క్రైం రేట్‌ ఏ విధంగా పెరుగుతుంది అన్న అంశాలు ఎన్నో ఉన్నాయి. సెల్‌ఫోన్‌ చిన్న పిల్లల విషయంలో ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది. దాని విషయాలన్నీ కూడా చాలా మందికి తెలిసిందే. దాంతో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలన్న సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఓ మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం అని చెప్పవచ్చు.

హీరో విషయానికి వస్తే... కంచర్ల ఉపేంద్ర కొత్త కుర్రాడే అయినప్పటికీ నటనలో ఎక్కడా తడబడకుండా చాలా చక్కగా నటించారు. ప్రతీ సన్నివేశాంలోనూ ఆయన హాయభావాలు ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న హీరోలాగా అనిపించాయి. బస్తీ కుర్రాడు ఎలా ఉంటారో అంతే మాస్‌ లుక్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. హీరో తండ్రి అయిన చిత్ర నిర్మాత కంచర్ల అచ్చుతరావు  ఇంకా ఆయనతో కలిసి ఐదు చిత్రాలను చేస్తున్నారు. హీరోయిన్‌ సావిత్రి కృష్ణ కూడా చాలా చక్కగా చలాకీగా నటించింది. కథ మొత్తం హీరో చుట్టూ తరుగుతుంటుంది. ఇక హీరో ఫ్రెండ్స్‌గా నటించిన జబర్దస్థ కమెడియన్స్‌ అందరూ కూడా బాగా నవ్వించారనే చెప్పాలి. బలగం మురళీధర్‌గౌడ్‌ గురించి చెప్పక్కర్లేదు ప్రతి సినిమాలోనూ ఆయనే ఉంటారు. సామాజిక మాధ్యమాల ఆధారంగా అమ్మాయిలు ఎలా మోసం చేయొచ్చు అనే పాత్రలో దామరాజు బాగా నటించారు. మిగతా నటీనటులందరూ కూడా తమ తమ పాత్రకి తగ్గట్టు నటనను కనబరిచారు.

కథ కథనం స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు బాగా తీశారు. మాస్‌ ఆడియన్స్‌ ని ఆకట్టుకునులా ఓ కొత్త హీరోను చూపించడం అంటే మాములు విషయం కాదు. అదే విధంగా మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం తియ్యడం అంటే మాములు విషయం కాదు. ఇక ఎడిటింగ్‌ పర్వాలేదనిపించుకుంది. నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా ఒక పెద్ద సినిమా రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రాన్ని అందరూ చూడొచ్చు.
రేటింగ్‌ 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: