రారా కృష్ణయ్య : రివ్యూ

రెజిన అందాలు ,సినిమాటోగ్రఫీ ,కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు (కొన్ని మాత్రమే) రెజిన అందాలు ,సినిమాటోగ్రఫీ ,కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు (కొన్ని మాత్రమే) పట్టు లేని కథనం ,బలం లేని సంభాషణలు ,ఎడిటింగ్ ,పాత్రలను మలచిన తీరు

కిట్టు(సందీప్ కిషన్) చెన్నై లో టాక్సీ తోలుకుంటూ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తూ ఉండేవాడు. అంతే కాకుండా తన సంపాదన అంతా తన ఓనర్ మాణిక్యం ముదలియార్(తనికెళ్ళ భరణి) దగ్గర దాచుకుంటాడు. సొంతంగా ఒక కార్ కొనుక్కోవాలన్న కిట్టు ఆలోచన నచ్చక మాణిక్యం కిట్టు ని మోసం చేస్తాడు. దాంతో కిట్టు అనుకోకుండా నందీశ్వరి(రెజిన) ని కిడ్నాప్ చేస్తాడు అక్కడి నుండి తన డబ్బులు కోసం మాణిక్యం ను బ్లాకు మెయిల్ చేస్తుంటాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక నందు , కిట్టు ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కాని కిట్టు మాత్రం తన మీద కిడ్నాపర్ అన్న ముద్ర పడకూడదు అని నందు ను మాణిక్యం కి అప్పజేప్పేయాలని అనుకుంటాడు అదే సమయంలో , నందు ని జగ్గు భాయ్ (జగపతి బాబు) మనిషి అప్పాజీ( బ్రహ్మాజీ) కిడ్నాప్ చేస్తాడు. అసలు జగ్గు భాయ్ ఎవరు? నందు ని ఎందుకు కిడ్నాప్ చేసారు? కిట్టు కి మాణిక్యం నుండి డబ్బులు చేరాయా? కిట్టు నందు ప్రేమను ఎలా ఒప్పుకున్నాడు? అన్నదే మిగిలిన కథాంశాలు..

సందీప్ కిషన్, నటనాపరంగా మొదట్లో అంచెలంచెలుగా ఎదిగిన ఈ నటుడు ఈ మధ్య కాలంలో ఒకే చోట స్థిరపడి పోయినట్టుగా అనిపిస్తుంది. గత మూడు చిత్రాలలో ఈయన నటన ఒకేలా ఉంది.. ఇక ఈ చిత్రంలో అయన పాత్ర అటు అమాయకమయిన పాత్రనా లేకపోతే మాస్ పాత్రనా అని అర్ధం కాదు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో ఈయన నటన తేలిపోయింది. కాని కొన్ని సన్నివేశాలను మాత్రం తనదయిన శైలి టైమింగ్ లో ఆకట్టుకున్నారు.. రెజిన , ఈ చిత్రానికి ప్రధాన హైలెట్ ఈ నటి తన అభినయం మరియు అందం రెండు ఆకట్టుకున్నాయి. జగపతి బాబు , ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ పాత్ర కాని ఈ పాత్ర ఆ ప్రభావం చూపించాకపోగా బాగా నవ్వించింది. కాని ఒక్క విషయం మాత్రం నిజం ఈ పాత్ర జగపతి బాబు కనుక చెయ్యకపోయి ఉంటె రెండవ అర్ధ భాగం దారుణంగా ఉండేది. మాణిక్యం ముదలియార్ పాత్రలో తనికెళ్ళ భరణి సరిగ్గా సరిపోయారు కాని తమిళ యాసలో తెలుగు మాట్లాడటం కాస్త తేడాగా అనిపించింది. కళ్యాణి, బ్రహ్మాజీ , రవిబాబు,చలపతి రావు, తాగుబోతు రమేష్ , జబర్దస్త్ శంకర్ మొదలగున వారు అల కనిపించి ఇలా వెళ్ళిపోయారు..

దర్శకుడు మహేష్ బాబు. పి , కథ ను హిందీ నుండి తీసుకొని దానికి తగ్గ తెలుగు కథనం రాసుకోవడానికి ప్రయత్నించారు కాబట్టి ట్విస్ట్ లు అలానే ఉంచేసి ఆ ట్విస్ట్ లకు దారి తీసే సన్నివేశాలను మార్చుకోవాలని అనుకున్నారు కాని మన దగ్గర ట్విస్ట్ లు ఉన్నాయి కదా అని మధ్యలో వచ్చిన శూన్యాన్ని ఏదో ఒక సన్నివేశాలతో నింపేస్తే సరిపోతుంది అని చాలా అనవసర సన్నివేశాలను రచించారు. ఇక రెండవ అర్ధ భాగంలో హిందీ లో తండ్రిని తెలుగు అన్నయ్యను చేసాడు ఆ పాత్రకు జగపతి బాబు ని ఎంచుకున్నాడు కాని మళ్ళీ అదే రొటీన్ పంథా చివర్లో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలకు పునాదులు లేని సన్నివేశాలు రాసుకున్నారు. కామెడీ కూడా పూర్తిగా వర్క్ అవుట్ అవ్వకపోవడంతో కథనం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. డైలాగ్స్ కూడా సందర్భానికి తగ్గట్టుగా గట్టిగా లేవు ఏవో ఉండాలి కాబట్టి ఉన్నాయి అన్నట్టు ఉంది. శ్రీరాం అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కేరళ విజువల్స్ ని చాలా అందంగా చూపెట్టారు. సంగీతం అందించిన అచ్చు పాటలు పరవాలేదనిపించాడు కాని నేపధ్య సంగీతం బాగా ఇచ్చాడు కీలక ఎమోషనల్ సన్నివేశాల వద్ద ఈయన అందించిన నేపధ్య సంగీతం చాలా తోడ్పడింది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ అసలు బాగోలేదు చాలా సన్నివేశాలు పొడవుగా అనిపించడమే కాకుండా చిత్రం కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి ఎస్వీకే సినిమాస్ ఈ విషయంలో ఎక్కడ వెనుకడుగు వెయ్యలేదు.

ముందుగా ఈ చిత్రం హిందీ చిత్రం అయిన "తేరే నాల్ లవ్ హోగయ" అనే చిత్రం ఫ్రీమేక్, అవును హక్కులు కొని చేస్తే రీమేక్ ఇలా ఆ కథని మా సొంతం అన్నట్టు చేస్తే ఫ్రీమేక్.. ఇంక చిత్ర విషయానికి వస్తే మొదటి నుండి కూడా ప్రేక్షకుడిని చిత్రంలో లీనమవ్వకుండా దర్శకుడు చాలా జాగ్రత్త వహించాడు తను చెప్పాలి అనుకున్నదే చెప్తున్నాడు కాని ఎలా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం అన్న అంశాలను పూర్తిగా గాలికి వదిలేసాడు. పోనీ పాత్రల మధ్యన అయిన సరయిన కనెక్షన్ కుదిరిందా అంటే అదీ లేదు. ఏ పాత్రకు ఆ పాత్రా దానికి నచ్చినట్టు నటించింది మరొక పాత్రతో ఫోర్మాలిటి కోసం కలిసినట్టు అనిపిస్తుంది. మొదటి అర్ధభాగం మొదలయ్యి చాలా సేపు అయిన చిత్రం ఎటువైపు సాగుతుంది అనేది ప్రేక్షకుడికి అర్ధం కాదు. ఇక్కడ కామెడీ తో నింపి ఉంటె ప్రేక్షకుడికి ఆలోచించే అవసరం కూడా ఉండేది కాదు కాని అది పక్కన పెట్టేసి రొమాన్స్ కి కామెడీ లాంటి అంశాన్ని కలిపి ఏదో చేసెయ్యాలని ప్రయత్నించిన దర్శకుడి ప్రయత్నం విఫలం అయ్యింది. ఈ సన్నివేశాలు నవ్వించను లేదు కవ్వించను లేదు మరి ఈ సన్నివేశాలు ఎందుకోసం అన్నది దర్శకుడికే తెలియాలి. ఇక చెన్నై లో అందరు తెలుగు మాట్లాడటం ఏంటి? చెన్నై చుట్టూ కథ తిరుగుతున్న ఎక్కడ చెన్నై అని ఫీల్ రప్పించలేదు.. అసలు ఈ కథకు చెన్నై బ్యాక్ డ్రాప్ ఎందుకు అనేది ఎవరికీ అర్ధం కాని విషయం.. ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి కాని సమాధానాలు దొరకడం మాత్రం కష్టం.. ఈ చిత్రంలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మొదటిది రెజిన అందాలు, సినిమాటోగ్రఫీ అద్భుతమయిన ప్రదేశాలను మరింత అద్భుతంగా చూపెట్టారు సినిమాటోగ్రాఫర్... కాని ఈ చిత్రానికి ఊపు తెచ్చిన జగ్గు భాయ్ పాత్రకి సినిమాలో అంత సీన్ లేకపోవడం బాగా నిరసపరిచిన విషయం .. ఈ విషయం కన్నా ఎక్కువగా ఇబ్బంది పెట్టిన విషయం సినిమాలో విషయం లేకపోవడం.. అవును ఇది హిందీ రీమేక్ చిత్రమే దాన్ని ఇక్కడికి తగ్గట్టు మార్చుకున్నారు కాని అవేవి ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయాయి.. ఇక రెండవ అర్ధ భాగంలో రవి బాబు చేత కామెడీ అన్న పేరుతో చేయించిన "ఫ్రస్ట్రేషన్ డిజాస్టర్ చెకొస్లవేకియ" అనే రోగం నవ్వించలేకపోయింది... ఈ చిత్రం చూడాలా వద్దా అన్నది మీ నిర్ణయమే, మా సలహా అయితే రెజిన అభిమానులు అయితే ఒక్కసారి తప్పకుండ చూడవచ్చు.. లేదా సినిమాటోగ్రఫీ మరియు సంగీతం కోసం ఒక్కసారి ప్రయత్నించవచ్చు ఇంతకు మించి ఈ చిత్రంలో చూడటానికి ఎం లేదు..

Sundeep Kishan,Regina Cassandra,Mahesh,Vamsi Krishna Srinivas.రారా కృష్ణయ్య : ఇలా ఉంటె ఎలా రాము కృష్ణయ్య ....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: