హీరో సినిమా కోసం లారీ ఎక్కి వెళ్లిన రోజులు.. సీఎం గుర్తుచేసుకున్న జ్ఞాపకాలు!
మా హీరో అంటూ :
సూపర్ స్టార్ కృష్ణ అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆయన ఒక విప్లవం. తొలి సినిమా స్కోప్, తొలి 70MM సినిమా, తొలి కౌబాయ్ మూవీ.. ఇలా తెలుగు సినిమాకు ఎన్నో ‘తొలి’ అడుగులు నేర్పిన ఘనత ఆయనదే. ఐదున్నర దశాబ్దాల క్రితమే ‘మోసగాళ్లకు మోసగాడు’తో హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌ను చూపించిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ.ఏడాదికి ఏకంగా 18 సినిమాలు చేస్తూ, వేలాది మంది కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు ఉపాధి కల్పించిన ఏకైక హీరో ఆయనే. 350 సినిమాలు, 20 సినిమాల దర్శకత్వం.. ఈ రికార్డులు ఎప్పటికీ చెక్కుచెదరనివి.
ఫ్లాష్ బ్యాక్ లో అలా :
అల్లు సినిమాస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు."నేను సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమానిని. వనపర్తిలో చదువుకునే రోజుల్లో ఆయన సినిమా చూడటం కోసం ఎంత కష్టానికైనా ఓర్చేవాడిని" అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు.కృష్ణ గారి సినిమాలు వాళ్ల ఊర్లో రిలీజ్ కాకపోతే.. నేషనల్ హైవే మీదకు వెళ్లి లారీలు పట్టుకుని మరీ కర్నూల్ లేదా హైదరాబాద్ వెళ్లి మొదటి రోజు సినిమా చూసేవారట. ఆ రోజుల్లో లారీలు ఎక్కి సినిమాకు వెళ్లడం ఒక అద్భుతమైన అనుభూతి అని ఆయన పాత రోజులను నెమరువేసుకున్నారు.
ప్రస్తుతం తెలుగు సినిమా బాలీవుడ్‌ను మించి దూసుకుపోతోందని, కానీ మన లక్ష్యం హాలీవుడ్ కావాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు దర్శకులకు, నటులకు హాలీవుడ్‌తో పోటీ పడే సత్తా ఉందని, ఆ దిశగా టాలీవుడ్ అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. బాహుబలి, కల్కి లాంటి సినిమాలు ఆ మార్గాన్ని ఇప్పటికే సుగమం చేశాయని కొనియాడారు.ఒక లెజెండరీ హీరో గురించి ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.