స్టార్ హీరో రజనీకాంత్ ఆటోబయోగ్రఫీ.. ఐశ్వర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్!
సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది ఒక ప్రభంజనం. ఏడు పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సామాన్య బస్ కండక్టర్ స్థాయి నుంచి ప్రపంచం గర్వించే సూపర్ స్టార్‌గా రజనీకాంత్ ఎదిగిన తీరు కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. అందుకే ఆయన జీవితం వెండితెరపై ఎప్పుడు ఆవిష్కృతమవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
గత కొంతకాలంగా రజనీ బయోపిక్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తన తండ్రి ఆటోబయోగ్రఫీకి సంబంధించిన పనులను తాను ఇప్పటికే ప్రారంభించానని, ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కూతురిగా ఉండటం అంత తేలికైన విషయం కాదని, ఆ హోదా వల్ల కలిగే బాధ్యతలు, ఒత్తిడిని ఆమె ప్రస్తావించారు.
ప్రస్తుతం సినిమా రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతపై కూడా ఐశ్వర్య తనదైన శైలిలో స్పందించారు. ఏఐ అనేది ఒక మంచి పరిణామమే అయినప్పటికీ, అది కేవలం కృత్రిమమైనది మాత్రమేనని, మానవ భావోద్వేగాలకు అది ప్రత్యామ్నాయం కాలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 2014లో విడుదలైన 'కొచ్చడయాన్' వంటి మోషన్ క్యాప్చర్ సినిమాలను తీయడం తనకు ఎంతో ఇష్టమని, ప్రస్తుత అధునాతన టెక్నాలజీతో అలాంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడం ఇప్పుడు మరింత సులభమని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, ఐశ్వర్య రజనీకాంత్ నిర్మాతగా 'విత్ లవ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అభిషన్ జీవింత్ హీరోగా, మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన విడుదల కానుంది. ఒకవైపు తండ్రి బయోపిక్ పనులతో పాటు మరోవైపు నిర్మాతగా కొత్త సినిమాలతో ఐశ్వర్య ఫుల్ బిజీగా గడుపుతున్నారు.